కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు మోదీయే సంరక్షకుడు

కరోనాతో చనిపోయిన వారి పిల్లలకు ఇకపై సంరక్షకునిగా ప్రధాని నరేంద్ర మోదీ ఉంటారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 4,345 మంది బాధిత పిల్లలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పిల్లల్లో 18 ఏళ్లు నిండిన వారి పేరిట చెరో రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. 
 
ఇందుకు సంబంధించిన  ‘పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్’ను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సోమవారం ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో బాధిత పిల్లలకు ‘స్నేహమిత్ర’ ధ్రువపత్రాలను పంపిణీ చేస్తామని చెప్పారు. 
 
2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి మధ్యకాలంలో తల్లిదండ్రులను, సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు సంరక్షకునిగా ప్రధాని ఉంటారని వివరించారు. 23 ఏళ్లు నిండి, తమ కాళ్లపై తాము నిలబడే వరకు బాధిత పిల్లలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 బంధువుల ఇళ్లలో లేదా చైల్డ్ వెల్ఫేర్ హోంలలో ఎక్కడైనా ఉండి వారు చదువుకోవచ్చని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారి పేరిట డిపాజిట్ చేసిన రూ.10 లక్షలపై వచ్చే వడ్డీని కూడా వాళ్ళ అకౌంట్లలోనే జమ చేస్తామని పేర్కొన్నారు.  అయితే 23 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే రూ 10 లక్షలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో ప్రతినెలా స్టైపెండ్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఒకవేళ స్టైపెండ్ ను కూడా వాడుకోకుంటే సేవింగ్స్ అకౌంట్లో జమచేస్తామని, అవసరమైనప్పుడు డ్రా చేసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఈ ప్రయోజనానికి అదనంగా వారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని పథకాల నుంచి కూడా లబ్ధి పొందొచ్చని పేర్కొన్నారు.
కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేసే ‘మిషన్ వాత్సల్య’ పథకం ద్వారా ప్రతి నెలా రూ.4వేలు పొందొచ్చని ఆయన వివరించారు. సామాజిక న్యాయశాఖ నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులకు అదనంగా రూ.20వేల సాయం అందేలా ఏర్పాటు చేస్తామన్నారని వివరించారు.
 
సాంకేతిక విద్య చదివే వాళ్లకు ఏటా మరో రూ.50వేలు ఇప్పిస్తామని పేర్కొన్నారు. స్కిల్ ట్రైనింగ్ కోసం ‘కర్మ’ స్కీమ్ ద్వారా ఉపకార వేతనం మంజూరు చేయిస్తామని తెలిపారు. నవోదయ, సైనిక్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాల్లోనూ బాధిత పిల్లలకు సీట్లను రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. 
 
ఈ పిల్లలకు అడ్మిషన్లలో ప్రాధాన్యం ఇవ్వాలంటూ అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీ చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఒకవేళ ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటామన్నా పీఎం కేర్స్ నుంచి బాధిత పిల్లల ఫీజులు కట్టేందుకు సిద్ధమని తెలిపారు. 
 
విదేశీ విద్యకు వెళ్లాలనుకునే బాధిత పిల్లలకు రుణాల ఇప్పించి, దానిపై పడే వడ్డీని పీఎం కేర్స్ భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రుల బృందం, ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోర్టల్ కూడా  అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
 దానిలోకి జిల్లాల కలెక్టర్లు, కరోనాతో కన్నవారిని కోల్పోయిన పిల్లలకు మాత్రమే యాక్సెస్ ఉంటుందని చెప్పారు. వారు అందులోకి వెళ్లి తమ సమస్యలను అధికారుల దృష్టికి నేరుగా తీసుకురావచ్చని వివరించారు. వీటన్నింటికి అదనంగా బాధిత పిల్లలకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా కూడా చేస్తామని చెప్పారు.
కాగా,  ఈనెల 31న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ‘కిసాన్ సమ్మాన్ నిధి’ లబ్ధిదారుల సమావేశాలు జరుగుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజున ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ రూ.20వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసి, ప్రసంగిస్తారని చెప్పారు.