మూసేవాలా హత్యపై కాంగ్రెస్, బీజేపీ నిరసనలు

పంజాబీ ర్యాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యపై సోమవారం పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో నిరసనలు పెల్లుబికాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. మాన్ సర్కార్ ను రద్దు చేయాలని పంజాబ్ బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

పంజాబ్ లో కీలుబొమ్మ  ప్రభుత్వం ఉందని, ఇక్కడి సున్నిత పరిస్థితుల గురించి  సీఎంలు భగవంత్, కేజ్రీవాల్ లకు తెలియదని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు  గవర్నర్ తో జరిపిన భేటీలో కోరారు. మూస్ వాలా భధ్రతను ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు.

 ఈ హత్యను రాజకీయ హత్యగా పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం ఎదుట కూడా నిరసనకారులు బైఠాయించారు. జస్టిస్ ఫర్ మూసేవాలా అంటూ ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. 

మూసేవాలా తండ్రి బాల్ కౌర్ సింగ్  తన కుమారుడి మృతిపై సీబీఐ, ఎన్ఐఎ  దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ కు లేఖ రాశారు. అలాగే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేయారు. దీనికి ప్రభుత్వం అంగీకరించింది. మరోవైపు.. మూసేవాల ప్రయానించిన వాహనం నుంచి ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించారు. 

ఇాదిలా ఉంటే సిద్ధూ హత్యపై పంజాబ్ పోలీసులు విచారణను వేగవంతం చేశారని డీజీపీ వీకే భావ్రా తెలిపారు. సిద్ధూ హత్యపై ఆయనతో పాటు ఇతర పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ సిద్ధూ ఆదివారం మాన్సా జిల్లాలోని తన స్వగ్రామం మూసేవాలాకు థార్‌ జీపులో ప్రైవేటు అంగరక్షకుడు (బౌన్సర్‌), మరో వ్యక్తితో కలిసి బయలుదేరారని చెప్పారు. 

జీపును సిద్ధూ నడుపుతుండగా.. జవహార్కే గ్రామం వద్ద రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు వీరి కారును వెంబడించారు. ఓ కారు వీరిని ఓవర్‌టేక్‌ చేసి.. ముందుకు వెళ్లి నిలిచింది. దాంతో మూసేవాలా తన వాహనాన్ని నిలిపారు. 

మూడు ఎస్‌యూవీల్లోంచి పిస్టళ్లు, ఏకే-47తో దిగిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులకు దిగారని వివరించారు. మూసేవాలా కారుపై 46 రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించింది.

కాగా, సింగర్ సిద్ధూ మూసెవాలా హత్య కేసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సిట్టింగ్ జడ్జి  నేతృత్వంలోని ప్రత్యేక బృందం దర్యాప్తు చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్  సోమవారం ప్రకటించారు. సిద్ధూ తండ్రి బాల్కర్ సింగ్ సిద్ధూ అభ్యర్థన మేరకు ఈ కేసును సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి అభ్యర్థిస్తుందని ఆయన తెలిపారు. 

ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సైతం పేర్కొన్నారు. సిద్ధూ హత్యను ఖండిస్తూనే..  ఈ దారునానికి పాల్పడ్డ వారిని కటకటాలకు నెట్టే వరకు ప్రభుత్వం అవిశ్రాంతంగా శ్రమిస్తుందని, ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని మాన్ స్పష్టం చేశారు. 

మరోవంక,  సింగర్ సిద్ధూ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయి హస్తముందని నిన్నటి నుంచి వస్తున్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ గోల్డీ బ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇందుకు మరింత బలాన్ని ఇస్తోంది. అతడి ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. సిద్ధూ హత్యపై పూర్తి బాధ్యత తనతో పాటు సచిన్ బిష్ణోయ్ ధత్తరన్‌వాలి, లారెన్స్ బిష్ణోయ్ గ్రూపులదని చెప్పుకొచ్చాడు. కాగా యూత్ కాంగ్రెస్ నేత విక్కీ మిద్దుఖేరా, అకాలీదళ్ నేత గుర్లాల్ బ్రార్ హత్య సమయంలో కూడా తన పేరు బయటికి వచ్చిందని అయితే పోటీసులు తనను ఏమీ చేయలేదంటూ గోల్డీ వ్యాఖ్యానించాడు.

ఫేస్‌బుక్ ద్వారా వచ్చిన ఈ సమాచారం ఎంత వరకు వాస్తవమనేది నిర్ధారణ కావాల్సి ఉంది. నిజంగానే గోల్డీనే ఈ పోస్ట్ చేశాడా, ఇంకెవరైనా ఇలా తప్పుదారి పట్టిస్తున్నారా అనే విషయంపై విచారణ చేయాల్సి ఉందని అంటున్నారు. అయితే గోల్డీ ఇంతకు పలు నేరాల్లో నిందితుడిగా ఉన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్లాల్ సింగ్ పెహల్వాన్ హత్యకు సంబంధించి నెల రోజుల క్రితమే ఫరీద్‌పూర్ కోర్టు గోల్డీకి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.