ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్‌ఫోన్‌ .. ప్రతి పొలంలో డ్రోన్‌

‘‘ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్‌ఫోన్‌ అందాలి. ప్రతి పొలంలో డ్రోన్‌ తిరగాలి. ప్రతి ఇంట సౌభాగ్యం నిండాలి. ఆజాదీ అమృత్‌ మహోత్సవం వేళ నేను ఈ కల కంటున్నాను’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టెక్నాలజీని గత ప్రభుత్వాలు ఒక సమస్యగా, పేదల వ్యతిరేక విధానంగా చూడగా  నూతన ఉపాధి, ఉద్యోగ అవసరాలకు వనరుగా తాము దానిని ఎనిమిదేళ్లలోనే మలిచి వేశామని మోదీ పేర్కొన్నారు.

దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ ఎగ్జిబిషన్‌ భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌–2022ను ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన, సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ ప్రభుత్వం ఆశించిన గ్రామస్వరాజ్‌ సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు.

డ్రోన్‌ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయం రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్‌ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగావకాశాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. డ్రోన్‌ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని ఆయన  చెప్పా రు.

‘‘పెద్ద మార్పులకు చిన్న డ్రోన్లే శోధకాలు. గ్రామాల్లో ఆస్తుల మ్యాపింగ్‌కు తొలిసారి డ్రోన్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నారు’’ అని ప్రధాని వివరించారు.  ‘ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలందించేందుకు డ్రోన్లు సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటోందిని చెబుతూ  సులభతర జీవనం, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. సుపరిపాలనకు కొత్త విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకువచ్చిందని చెప్పారు.

‘మారుమూల ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల సాయంతో అత్యవసరమైన ఔషధాలు వంటి వాటిని సులభంగా చేరవేయవచ్చు. పోలీసులు కూడా వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, అత్యాధునిక డ్రోన్‌ సాంకేతికతను భారత్‌తోపాటు ప్రపంచానికి అందించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా’అని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఉత్పాదకత అనుసంధాన పథకం (పీఎల్‌ఐ) వంటి విధానాల ద్వారా దేశంలో పటిష్టమైన డ్రోన్‌ ఉత్పత్తి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని చెప్పారు. కిసాన్‌ డ్రోన్‌ పైలట్లతోనూ, ఒపెన్‌ ఎయిర్‌ డ్రోన్‌ ప్రదర్శనకారులతోనూ, పలు స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతోనూ ఆయన మాట్లాడారు. డ్రోన్ల రంగంలో కనిపిస్తున్న ఈ ఉత్సాహం చూస్తుంటే త్వరలోనే ఇది ఉపాధి సృస్టి రంగం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో తొలిసారిగా గ్రామీణ ప్రాంతాలను డిజిటల్‌ మ్యాపింగ్‌ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పిఎం స్వామిత్వ యోజన’ గురించి ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో సాంకేతికత అనేది కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితమన భావించేవారనీ, ఇప్పుడు సామాన్యుల చెంతకు సాంకేతికతను తాము తీసుకెళ్తున్నామని ప్రధాని తెలిపారు.

డ్రోన్ల తయారీకి అనువైన వాతావరణం సృష్టించే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. శనివారం కూడా కొనసాగనున్న ఈ డ్రోన్ల ఉత్సవానికి దాదాపు 1600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా, మన్‌సూఖ్‌ మాండవీయ, అశ్వినీ వైష్ణవ్‌, గిరిరాజ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

డ్రోన్ల మహోత్సవ ప్రాంగణంలో ప్రధాని మోదీ సరదాగా గడిపారు. డ్రోన్ల పనితీరును తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఓ డ్రోన్‌ను ఎగరవేయడానికి ప్రయత్నించారు. ఈ డ్రోన్‌ను బెంగళూరుకు చెందిన ఆస్టేరియా ఎయిరోస్పేస్‌ లిమిటెడ్‌ అనే సంస్థ తయారుచేసింది.