వంద రూపాయ‌ల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ‌

దివంగ‌త న‌టుడు, టిడిపి వ్యవస్థాపకుడుమాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త జ‌యంతి సంవత్సరం సందర్భంగా వంద రూపాయ‌ల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ‌ను ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకుతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించిన పురందేశ్వరి అనంతరం మాట్లాడుతూ నేటి నుంచి వచ్చే ఏడాది మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 12 కేంద్రాలను గుర్తించినట్టు తెలిపారు. వాటిలోనే ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 

ఈ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, అందులో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నట్టు ఆమె చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా అన్ని రంగాల్లో నిపుణులైన వారిని సత్కరించనున్నట్టు పురందేశ్వరి వెల్ల‌డించారు.

కాగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద శనివారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‎లులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

ఎన్టీఆర్ కు సంజయ్ ఘన నివాళులు 
 
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు సినిమా రంగాన్ని ఐదు దశాబ్దాలపాటు ఉర్రూతలూగించిన ఆణిముత్యం అంటూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నివాళులు అర్పించారు.  
 
 మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు.  శ్రీకృష్ణుడిగా, రాముడి వంటి దేవుళ్ల పాత్రలే కాకుండా ఏ హీరో సాహసం చేసేందుకు ఇష్టపడని ధుర్యోధనుడు, రావణాసురుడు వంటి విలన్ పాత్రలతో పాటు బ్రుహన్నల వంటి హిజ్రా పాత్రలను సైతం పోషించి మెప్పించిన మహా నటుడని కొనియాడారు.
 
రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి 80వ దశకంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.  ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే పేదల సంక్షేమం కోసం ఆయన ఎంతగా పరితపించారో అర్ధం చేసుకోవచ్చని తెలిపారు.
 
ఎన్టీఆర్ జ్ఝాపకాల గుర్తుగా ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ ఘాట్’ ను కూల్చేస్తామని మజ్లిస్ వంటి కుహానాశక్తులు గతంలో కుట్రలు చేయడం హేయనీయం అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఘాట్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు.