సగం మంది విద్యార్థులు కాలినడకనే బడికి!

దేశంలో దాదాపు సగం మంది విద్యార్థులు కాలినడకన పాఠశాలలకు వెళ్తున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో 48 శాతం మంది విద్యార్థులు తమ పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్నారని నేషల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎన్‌ఏఎస్‌)-2021 సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుండి 720 జిల్లాల్లోని 1.18 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన సుమారు 34 లక్షల మంది విద్యార్థులు సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 3, 5, 8, 10 తరగతి విద్యార్థులు అభ్యసన సామార్థ్యాలపైన నిర్వహించారు.
 విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలు జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలోని రెండు మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామార్థ్యాలు తక్కువగా ఉన్నాయని తేలింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా 18 శాతం మంది విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తున్నారని పేర్కొంది.
3, 5, 8, 10 తరగతుల్లో చాలా పరిమిత సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలు అందించే రవాణాను ఎంచుకుంటున్నారు. పాఠశాలల్లో బస్సు సౌకర్యం ఉన్నప్పటికినీ ఆర్థిక సమస్యల నేపథ్యంలో 9 శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూల్‌ బస్సులను ఎంచుకుంటున్నారు.
అదేవిధంగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకొని పాఠశాలలకు వెళ్తున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారని సర్వేలో వెల్లడైంది. మరో 8 శాతం మంది విద్యార్థులు మాత్రం తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు చెందిన ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తుంటే, 3 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు ఫోర్‌ వీలర్లలో వస్తున్నట్లు సర్వేలో తేలింది.
కరోనా  సమయంలో విద్యార్థుల అభ్యసన సామార్థ్యాలు ఎలా ఉన్నాయనే దానిపై ఎన్‌ఏఎస్‌ సర్వే చేసింది. కరోనా  సమయంలో పాఠశాలలు మూసివేసిన తర్వాత 78 శాతం మంది ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి దగ్గర నేర్చుకోవడానికి ఆసక్తి చూపించలేదు.  80 శాతం మంది విద్యార్థులు పాఠశాలలోనైతెనే బాగా నేర్చుకుంటున్నారని నివేదికలో తెలిపింది.
24 శాతం మంది విద్యార్థులకు సాంకేతిక పరికరాలు లేవు. 38 శాతం మంది కరోనా  సమయంలో నేర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎన్‌ఏఎస్‌ వెల్లడించింది. ప్రైవేట్‌ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా ఓసీ, బీసీ విద్యార్థుల కంటే కూడా ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలో వెల్లడైంది.