భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం 

భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని ప్రధాని నరేంద్ర  మోదీ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో  జరుగుతున్న బీజేపీ ఆఫీస్ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం ప్రారంభం సందర్భంగా వర్చువల్ విధానంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణమని స్పష్టం చేశారు.
ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి  ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని ప్రధాని  చెప్పారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం  ప్రాధాన్యమిచ్చిందని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు.

దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయడంతోపాటు అన్ని సవాళ్లను అధిగమించడంతోపాటు రాబోయే 25 ఏళ్లకు బీజేపీ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ ఈ సందర్భంగా పిలుపిచ్చారు.  “భారత్‌ను ఆకాంక్షలతో నిండిన దేశంగా చూస్తారు. ఇప్పుడు, భారతదేశంలోని ప్రతి పౌరుడు ఫలితాన్ని చూడటంతోపాటు పనిని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతోంది” అని చెప్పారు.

ఈ నెలలో కేంద్రంలో బిజెపి ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేస్తుందని చెబుతూ,  ఈ ఎనిమిదేళ్లు “సంకల్పాలు, విజయాలు” చూశామని, ఈ కాలం సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి అంకితమైందని పేర్కొన్నారు. “ఈ సంవత్సరాలలో దేశానికి సేవ చేయడం, పేద, మధ్యతరగతి సంక్షేమం కోసం పని చేయడంతో పాటు సామాజిక న్యాయం, భద్రత మరియు మహిళా సాధికారతను బలోపేతం చేయడం” చేయగలిగామని ప్రధాని వివరించారు.

బిజెపి నిరంతరం పని చేస్తూ ఉండాల్సిన ప్రాంతం అభివృద్ధి రాజకీయం అని కూడా ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి రాజకీయాలలో స్పష్టంగా పాలుపంచుకోవాలని మోదీ సూచించారు.  2014 తర్వాత, బిజెపి ప్రభుత్వం దేశ ప్రభుత్వం పట్ల ప్రజలకు నమ్మకాన్ని పునరుద్ధరించిందని చెబుతూ  గత ప్రభుత్వ హయాంలో ఈ నమ్మకం పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు.

ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు ఎన్నో ఆశలతో చూస్తోందని చెబుతూ  బీజేపీ ప్రభుత్వం దేశాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లిందని పేర్కొన్నారు. 2014 తర్వాత, పౌరుల నిరాశను అధిగమించడం ద్వారా బిజెపి ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందిందని పేర్కొంటూ ఇప్పుడు ప్రజల్లో ఉద్రిక్తలు, కోరికలు ఉన్నాయని తెలిపారు.

“దేశ పౌరుల ఈ ఆశలు, ఆకాంక్షలు మన బాధ్యత,  జవాబుదారీతనాన్ని పెంచుతాయి” అని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి చేతులు ముడుచుకుని కూర్చోకూడదని హితవు చెప్పారు.  అభివృద్ధికి అడ్డదారి ఉండదని చెబుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. వచ్చే 25 ఏళ్ల లక్ష్యాన్ని దేశం నిర్దేశిస్తోందని, అదే సమయంలో వచ్చే 25 ఏళ్లపాటు బీజేపీ లక్ష్య సాధనలో కొనసాగాలని మోదీ సూచించారు.

కాంగ్రెస్ పేరు చెప్పకుండానే కుటుంబ పార్టీ ధ్వజమెత్తుతూ కుటుంబ పార్టీలు ఇప్పటికీ దేశాన్ని వెనక్కు తీసుకెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రజా జీవితం కుటుంబంతో ప్రారంభమవుతుంది, కుటుంబం కోసం వెళుతుంది, కుటుంబం కోసం శ్రద్ధ వహిస్తుందని ఎద్దేవా చేశారు.  ఇటువంటి పార్టీలపై బీజేపీ పోరాడాలని పిలుపిచ్చారు.  దేశం ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించాలంటే, ఈ వంశపారంపర్యత, కుటుంబ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలని స్పష్టం చేశారు. 

శుక్రవారం నాటి సమావేశంకు అధ్యక్షత వహించిన పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా మాట్లాడుతూ, అవసరమైనప్పుడల్లా ప్రధాని మోదీ  నాయకత్వం, మార్గదర్శకత్వం బిజెపికి లభిస్తుందని చెప్పారు. “కరోనా ప్రసార కాలంలో, అన్ని రాజకీయ పార్టీలు లాక్‌డౌన్, ఐసోలేషన్‌లోకి వెళ్లి కేవలం ట్విట్టర్‌లో హాజరు నమోదు చేసుకున్నప్పుడు, మీరు (నరేంద్ర మోదీ) మాకు ‘సేవా హి సంగతన్’ అనే మంత్రాన్ని అందించారు. దీని స్ఫూర్తితో  మీరు చూపిన మార్గంలోప్రతి బీజేపీ కార్యకర్త నడిచారు” అని నడ్డా పేర్కొన్నారు.