ప్రధానిపై మంత్రుల  ఆరోపణలు తిప్పికొట్టిన బీజేపీ

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారంటూ తెలంగాణ మంత్రులు చేసిన ఆరోపణలను బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.  తెలంగాణ అభివ్రుద్దికి ఎంతగానో సహకరిస్తున్న నరేంద్రమోదీపై అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని బిజెపి ఎంపీ సాయం బాబురావు హెచ్చరించారు. 
 
 తెలంగాణలోని గ్రామాలను అభివ్రుద్ధి చేసేందుకు, పేదలను ఆదుకునేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది ముమ్మాటికీ వాస్తవం అని స్పష్టం చేశారు.  కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు వంటి అభివ్రుద్ధి పనులను చేస్తోంది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. 
 
కేంద్రం పేదలను ఆదుకునేందుకు, తెలాంగాణను అభివ్రుద్ధి చేసేందుకు ముందుకు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? అని నిలదీశారు.  రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇండ్లను మంజూరు చేసినా కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పేదలకు అన్యాయం చేస్తోంది నిజం కాదా? అంటూ మండిపడ్డారు. 
 
సైన్స్ సిటీ కోసం 25 ఎకరాలు అడిగితే ఎందుకు ఇవ్వలేదు? యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తామని ప్రతిపాదిస్తే ఎందుకు ముందుకు రాలేదు? తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? కొత్తగూడెం-భద్రాచలం వరకు రైల్వే లేన్ వేస్తామని చెబితే ఎందుకు స్పందించలేదు? వేములవాడ రాజన్న ఆలయ అభివ్రుద్దికి ప్రసాదం స్కీం కింద ప్రతిపాదనలు పంపాలని చెబితే నోరెందుకు మెదపరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిన మాట వాస్తవం కాదా? కేసీఆర్ ఇంట్లోనే 5 గురికి పదవులున్న మాట నిజం కాదా? పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని దోచుకుంటోంది నిజమే కదా? రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ఉద్యోగాలకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది వాస్తవమే కదా? మరి ప్రధాని చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? అంటూ బాబురావు కేసీఆర్ ప్రభుత్వం ధోరణిపై ధ్వజమెత్తారు. 
 
ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని తెలిసి కనీస మర్యాద పాటించకుండా పక్క రాష్ట్రానికి పారిపోయిన సీఎం కేసీఆర్ సిగ్గులేకుండా తన మంత్రులతో ఎదురుదాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో కుటుంబ, వారసత్వ పాలనను కూకటి వేళ్లతో పెకలించే వేసే సత్తా బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ సహా దేశవ్యాప్తంగా మరో వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేరని ధ్వజమెత్తారు. 
 
కాగా, ప్రధాని మోదీ మాట్లాడివన్నీ అక్షర సత్యాలే అంటూ నిజాలు మాట్లాడితే రాష్ట్ర మంత్రులకు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ నిలదీశారు.
మజ్లిస్ నేతలతో అంటకాగుతూ 15 శాతం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది టీఆర్ఎస్ నేతలు కాదా?  అని ప్రశ్నించారు.