బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ప్రధాని చెన్నై పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటన  రాష్ట్ర బీజేపీ శ్రేణులలో గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహం నింపింది. గతంలో పలుమార్లు ప్రధాని పర్యటించినప్పటికీ ఈసారి ఆయన రాకకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. వేలాది కోట్ల రూపాయలతో నిర్మించిన చారిత్రక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, అంతకంటే మిన్నగా పలు ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం గురించి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విస్త్రతంగా ప్రచారం చేసింది. 
 
అంతేగాక మోదీ ప్రసంగంలో సైతం తమిళ భాషను, తమిళ సంస్కృతీ సంప్రదాయాలను ప్రశంసించడం, రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల పేర్లను అవలీలగా ఉచ్ఛరించడం విశేషంగా ఆకట్టుకున్నాయి.  అంతేగాక మెరీనాబీచ్‌ రోడ్డు సమీపంలోని అడయార్‌ ఐఎన్‌ఎ్‌స హెలిప్యాడ్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం వరకు దారి పొడవునా బీజేపీ కార్యకర్తలతో పాటు సాధారణ పౌరులు సైతం రోడ్డుకిరువైపులా నిలబడి ప్రధానికి స్వాగతం పలకడం విశేషం. 
 
అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం పోటీపడి మోదీకి స్వాగతం పలికారు. ప్రజల నుంచి ఇంత స్పందన రావడం బీజేపీ నేతల్ని సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మోదీకి అపూర్వ స్వాగతం లభించడం, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రావడం పట్ల బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 
 
రూ.2900 కోట్లతో పూర్తయిన రాష్ట్రానికి చెందిన ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు ‘లైట్‌ హౌస్‌ ప్రాజెక్టు’ కింద రూ.116 కోట్లతో నిర్మించిన 1,152 గృహాలను ప్రధాని గురువారం ప్రారంభించారు. అదే విధంగా రూ.28,500 కోట్లతో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 
 
వీటిలో కొంత మేరకు రాష్ట్ర వాటా వున్నప్పటికీ మొత్తం కేంద్ర ప్రభుత్వ పథకాలే అన్న తరహాలో విస్తృత ప్రచారం జరిగింది.  కార్యక్రమాలన్నీ ప్రధాని చుట్టూనే తిరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం చుట్టూ ప్రధాని వాల్‌పోస్టర్లు, బీజేపీ తోరణాలే కనిపించాయి తప్ప, పెద్దగా డీఎంకే ప్రభావం కనిపించలేదు. 
 
వేదికపైనా ప్రధాని ఆధిక్యతే కనిపించింది. మోదీ వేదికపైకి వస్తూనే మొత్తం కలియ తిరుగుతూ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేయడంతో పాటు తలొంచి మరీ నమస్కరించడంతో సభికులు అరుపులు, కేకలు, కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. 
 
బీజేపీ జోష్‌తో డీఎంకే నేతలు డైలమాలో పడినట్లు కనిపిస్తోంది. తాము అధికారం చేపట్టిన తరువాత తొలిసారిగా ప్రధాని వస్తుండడంతో బీజేపీ స్వాగత ఏర్పాట్లకు అన్ని విధాలా సహకరించాలని ఆదిలోనే డీఎంకే నేతలు భావించారు.  అయితే ఈ ‘సహకారం’ బీజేపీ బలోపేతానికి, ప్రజల్లో ఆ పార్టీ చొచ్చుకుపోవడానికి కొంతమేర దోహదపడినట్లు డీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. స్టేడియానికి వచ్చిన డీఎంకే సీనియర్‌ నేతలు సైతం కాస్త అసహనంగానే కనిపించడం గమనార్హం. 
 
బహుశా ముఖ్యమంత్రి  స్టాలిన్‌ సైతం దీనిని గ్రహించడం వల్లనే వేదికపై ఎక్కడా ప్రధానిని కించిత్‌ కూడా ప్రశంసించకుండా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టినట్లు కనిపిస్తున్నది.  నిజమైన సమాఖ్య ఫెడరలిజం స్పూర్తికి కట్టుబడి ఉండాలని కేంద్రాన్ని కోరడం ద్వారా కేంద్రం రాష్ట్రాల పట్ల మరీ ముఖ్యంగా తమిళనాడు పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.
 
ట్విట్టర్ వార్ తిప్పికొట్టిన బీజేపీ
 
అంతకు ముందు ప్రధాని రాక సందర్భంగా ట్విట్టర్ వార్ జరిగింది. మోదీ ఎప్పుడు తమిళనాడు పర్యటనకు వచ్చినా `గో బ్యాక్ మోదీ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ తో ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమిళనాడుకు చెందిన కొందరు నెటిజన్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రకరకాల కారణాలతో మోదీ పర్యటనను కొందరు తమిళ తంబీలు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
అయితే, ఈ సారితమిళనాడు బీజేపీ సోషల్ మీడియా కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను తిప్పికొడుతూ `వణక్కం మోదీ’ హ్యాష్‌ట్యాగ్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. మోదీకి స్వాగతం పలుకుతూ నగరంలో పోస్టర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంతేకాదు.. కొన్ని పోస్టర్లపై 2024లో మధురై నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోరుతూ కార్యకర్తలు తమ అభిమతాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.