యాసిన్ మాలిక్ కు జైలు శిక్షతో వేర్పాటువాదంకు చావు దెబ్బ 

ప్రముఖ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఐపీసీలోని వివిధ సెక్షన్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద జీవిత ఖైదు, రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం కాశ్మీర్ లోయలోని  వేర్పాటువాద ఉద్యమానికి చావు దెబ్బ అని చెప్పవచ్చు. 
 
ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇతర వేర్పాటువాదులపై ఈ శిక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది.  మాలిక్ (56) జమ్మూ, కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్  (జెకెఎల్ఎఫ్) అధినేత. ఇది పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు, గిల్గిత్-బాల్టిస్తాన్‌తో సహా జమ్మూ, కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నది. 
 
గత ఏడాది సెప్టెంబరులో వేర్పాటువాద ప్రయోజనాల కోసం బలమైన గొంతుక, కరడుగట్టిన సయ్యద్ అలీ షా గిలానీ మరణించిన కొన్ని నెలల తర్వాత ఈ నేరారోపణ వీరి ఉద్యమంకు కోలుకోలేని దెబ్బగా మరిణమిస్తున్నది.  తీర్పు వెలువడే ముందు రాజధాని శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు బుధవారం బంద్ పాటించాయి. మాలిక్ ఇల్లు ఉన్న మైసుమాలో రాళ్లు రువ్విన సంఘటనలు కూడా జరిగాయి. 
 
అయితే, పోలీసులు రాళ్లు రువ్విన వారిని తరిమికొట్టారు.  మాలిక్‌కు శిక్ష విధించిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని కాపాడటం కోసం  శ్రీనగర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆర్టికల్ 370ని  రద్దు చేసే క్రమంలో ఫిబ్రవరి 2019లో మాలిక్‌ను అరెస్టు చేశారు. ఎన్ఐఎ అతనిపై  యూఏపీఏ , ఐపీసీ లలోని వివిధ సెక్షన్ల క్రింద నేరాలు మోపింది. 
 
1989లో జమ్మూ కాశ్మీర్ లో  మాజీ హోం మంత్రి ముఫ్తీ ముహమ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ, 1990లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళ అధికారులను హతమార్చిన కేసులో కూడా అతను విచారణను ఎదుర్కొంటున్నాడు. 1994లో మిలిటెన్సీని విడిచిపెట్టిన తర్వాత తాను ఎలాంటి ఉగ్రవాద చర్యకు పాల్పడలేదని మాలిక్ కోర్టులో స్పష్టం చేశారు.  
 
తనపై ఉగ్రవాదానికి సంబంధించిన ఆధారాలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాలిక్ ప్రకటించారు. విచారణపై తనకు విశ్వాసం లేదంటూ కోర్టును క్షమాపణ కోరబోనని చెప్పారు.,విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ ఎందుకు ఇచ్చారని, ఏడుగురు మాజీ ప్రధానులు తనతో ఎందుకు ఇంటరాక్ట్ అయ్యారని ఆయన కోర్టును ప్రశ్నించారు.
 
కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ చర్యల కారణంగా వేర్పాటువాద నాయకులు బైటకు రావడానికి భయపడుతున్నారని   భావిస్తున్న తరుణంలో మాలిక్‌కు శిక్ష పడింది. మాలిక్, షబీర్ షా, నయీం ఖాన్‌లతో సహా వేర్పాటువాద నాయకులు తీవ్రవాద నిధుల ఆరోపణలపై ఆర్టికల్ 370 రద్దుకు ముందు జైలు శిక్ష అనుభవించారు.
 
జె కె ఎల్ ఎఫ్ కు చెందిన హెచ్ఎజెవై – హమీద్, అష్ఫాక్, జావిద్,  యాసిన్- వంటి పేరుపొందిన వారిలో  ఒకరైన మాలిక్, 1987 ఎన్నికల తర్వాత ఆయుధ శిక్షణ కోసం నియంత్రణ రేఖ దాటిన మొదటి పురుషుల సమూహాలలో ఒకరు. వేర్పాటువాద పార్టీల కూటమి అయిన ముస్లిం ముతాహిదా మహాజ్ (ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ లేదా ఎంయుఎఫ్) అధికారంలోకి రాకుండా నిరోధించడానికి నేషనల్ కాన్ఫరెన్స్,   కాంగ్రెస్ ఎన్నికలను రిగ్గింగ్ చేశాయని ఆరోపించారు.
 
కాశ్మీర్‌లో మిలిటెన్సీ విస్ఫోటనం తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్  సుప్రీం కమాండర్ అయిన సయ్యద్ సలావుద్దీన్ అయిన పీర్ ముహమ్మద్ యూష్ షా, ఎంయుఎఫ్ కు మద్దతు ఇచ్చిన,  దాని అభ్యర్థులకు  ప్రచారం చేసిన అనేక మంది యువకులలో మాలిక్ కూడా ఉన్నాడు.
 
1990లో శ్రీనగర్‌లోని సురక్షిత గృహం నుంచి మాలిక్‌ను అరెస్టు చేశారు. సేఫ్ హౌస్ పై అంతస్తు నుంచి దూకి తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. 1994లో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత, అతను కాల్పుల విరమణ ప్రకటించాడు. 
 
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పోరాడటానికి  జె కె ఎల్ ఎఫ్  అహింసా మార్గాలను అనుసరిస్తుందని ప్రకటించాడు. అతని కాల్పుల విరమణ ప్రకటన కారణంగా  జె కె ఎల్ ఎఫ్   నుండి అతనిని ఆ సంస్థ  పోషకుడు అమానుల్లా ఖాన్ బహిష్కరించాడు. అయినప్పటికీ, అతను  జె కె ఎల్ ఎఫ్   లో పొందిన భారీ మద్దతు కారణంగా, దాని నాయకత్వం అతని చేతుల్లోనే ఉండిపోయింది. 
 
2001లో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతి పొందిన మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, ప్రొఫెసర్ అబ్దుల్ గనీ భట్, బిలాల్ లోన్, మోల్వీ అబాస్ అన్సారీలతో సహా వేర్పాటువాదుల బృందంలో మాలిక్ కూడా సభ్యుడు.
 
2009లో, అతను పాకిస్తాన్ పోరురాలు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి అయిన ముషాల్ ముల్లిక్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రజియా సుల్తానా అనే కుమార్తె ఉంది. ఆమె తన తల్లితో కలిసి పాకిస్థాన్‌లో నివసిస్తోంది.
 
హురియత్ కాన్ఫరెన్స్‌లోని ఏడుగురు సభ్యులలో మాలిక్ ఒకరు. హురియత్ తరువాత గిలానీ, మిర్వాయిజ్ నేతృత్వంలో రెండు వర్గాలుగా విడిపోయింది. మాలిక్ తన దారిన తాను వెళ్లాడు.  జె కె ఎల్ ఎఫ్ కు పీఓకే,   బ్రిటన్‌లోని కాశ్మీరీ డయాస్పోరా నుండి మద్దతు ఉంది, వారిలో ఎక్కువ మంది పీఓకే నుండి ఉన్నారు.