నేడే హైదరాబాద్ కు ప్రధాని మోదీ… బెంగళూరుకు కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోదీ  గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) 20వ సాన్నతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీజి రంగంలోకి దిగి ఐఎస్‌బి క్యాంపస్‌ను వారి ఆధీనంలోకి తీసుకుంది. 

అయితే ప్రధానికి స్వాగతం పలకడంకు విముఖంగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆయన రాకకు ముందే బెంగళూరుకు పెడుతున్నారు. ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పుడు సంప్రదాయబద్ధంగా ఇంతకు ముందు రెండు సార్లు నగరంలో ఉంది కూడా స్వాగతం పలకలేదు. 

ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ప్రధాని  మోదీ  గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగం పలకనున్నారు. 

మధ్యాహ్నం 1.45 గంటల వరకు ఎయిర్‌పోర్టు పార్కింగ్‌లో రాష్ట్ర బిజెపి నేతలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని, అక్కడ దిగిన తర్వాత రోడ్డు మార్గంలో గచ్చిబౌలి ఐఎస్బీకి చేరుకుంటారు.

మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బి వార్షికోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు మోదీ  చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు బేగంపేట నుండి చెన్నైకి బయల్దేరి వెళతారు. అక్కడ రూ.31,400 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

ప్రధాని శంకుస్థాపన చేయబోయే ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే బెంగళూరు- చెన్నై (262 కిమీ) ఎక్స్‌ప్రెస్ హైవే కూడా ఉంది. ఐఎస్‌బీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మొత్తం 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. వీళ్లలో మొహలీ క్యాంపస్‌కు చెందినప 330 మంది విద్యార్థులు ఉన్నారు. 

ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. గురువారం  మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 

గచ్చిబౌలి స్టేడియం, త్రిపుల్ ఐటి జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ నుంచి గచ్చిబౌలి మధ్య ఉన్న కంపెనీలు.. వారి ఆఫీస్ టైమింగ్స్ మార్చుకోవాలని సూచిస్తూ పలు మార్గాలలో ట్రాఫిక్ మళ్లింపు కూడా ప్రకటించారు.

మరోసారి మొహం చాటేస్తున్న కేసీఆర్ 

ప్రధాని హైదరాబాద్ కు వస్తుండగా, ఆయనకు స్వాగతం చెప్పాల్సి వస్తుందని ఏమో కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళుతున్నారు. కేసీఆర్‌ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో సమావేశమవుతారు.

శుక్రవారం రాలేగావ్‌ సిద్ధి పర్యటన చేపట్టనున్నారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సమావేశమై గ్రామాల అభివృద్ధికి జరుగుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం దాకా రాలేగావ్‌సిద్ధిలోనే ఉండే కేసీఆర్‌ అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి సాయిబాబా చెంతకు వెళ్లి ఆయనను కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు.  ప్రధానికి హైదరాబాద్ లో స్వాగతం చెప్పకుండా కేసీఆర్ సాకులు వెదుకుతూ ఉండడం ఇది మూడవసారి.

ప్రధాని మోదీకి మొహం చూపించలేక సీఎం కేసీఆర్ కర్టాటక పర్యటనకు వెళ్తున్నారని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు.  హైదరాబాద్ కు వస్తున్న మోదీకి ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఈ ఏర్పాట్లను  ఇతర పార్టీ నాయకులతో కలసి ఆయన బుధవారం పరిశీలించారు.

ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితిని కేసీఆర్ కాలరాశారని విమర్శించారు. సీఎం నిబంధనలు పాటించకుండా నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులను పట్టించుకోని కేసీఆర్ .ఇతర రాష్ట్రాల్లోని రైతులకు డబ్బలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.