కోనసీమ జిల్లాకు డా.అంబేద్కర్ పేరుపై వివాదం వద్దు 

కోనసీమ జిల్లాకు డా.అంబేద్కర్ పేరు పెట్టడంపై వివాదం చేయరాదని సామాజిక సమరసత వేదిక, ఆంధ్ర ప్రదేశ్, కోనసీమ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టంగుటూరు ప్రకాశం పంతులు పేరును ఒంగోలు జిల్లాకు, నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గా, కడప జిల్లాకు  వై.ఎస్.ఆర్ కడప జిల్లాగా గత ప్రభుత్వాలు పేర్లు పెట్టాయని  సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ కే. శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు కే.మన్మధరావు గుర్తు చేశారు. 
.
కాగా, తాజాగా  అన్నమయ్య, అల్లూరి, ఎన్టీ.ఆర్.పేర్లను ఆయా జిల్లాలకు పెట్టారని వారు పేర్కొన్నారు.  డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందని వారైనా ఆయన ఒక జాతీయ నాయకుడు అని. ఒక కులానికో, ఒక పార్టీకో, ఒక ప్రాంతానికి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను పరిమితం చేయడం తగదని వారు హితవు చెప్పారు. 
 
నేడు రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలకు సమయం కాదని పేర్కొంటూ అందరం కలిసి కోనసీమలోని అశాంతిని ఆర్పవలసి ఉందని వారు పిలుపిచ్చారు. నేటి కోనసీమ జిల్లాకు “డా. అంబేడ్కర్ కోనసీమ” జిల్లాగా పేరు పెట్టడంపై అందరూ ఏకాభిప్రాయానికి రావాల్సిందిగా సామాజిక సమరసత వేదిక ఒక ప్రతిపాదనను ప్రజల ముందుంచుతున్నట్లు వారు తెలిపారు. 
 
 అల్లర్ల వెనుక వైసీపీ కౌన్సిలర్‌  ప్రమేయం 
 
అమలాపురం అల్లర్ల వెనుక వైసీపీ కౌన్సిలర్‌  ప్రమేయం ఉందని  రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. అల్లర్లకు రౌడీషీటర్లను కౌన్సిలర్‌ ప్రోత్సహించారని విశ్వరూప్ తెలిపారు. మంగళవారం ఆందోళనకారులు చుట్టుముట్టి తగులబెట్టిన  బ్యాంకు కాలనీలో ఉన్న తన ఇంటిని ఆయన బుధవారం సందర్శించారు. 
 
 కాలిపోయిన రెండు అంతస్తులను ఆయన పరిశీలించారు. అద్దె ఇల్లు కావడంతో ఇంటి యజమానితో మంత్రి మాట్లాడారు. తనకు న్యాయం చేయాలని మంత్రిని యజమాని కోరారు. 
 
కాగా, అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. విధ్వంసంపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు.
 
 జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేత‌బ‌ట్టిన అన్యం సాయి వీడియోలు ప్ర‌స్తుతం న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు నేతృత్వం వ‌హించాడంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అల్ల‌ర్ల‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌పై అత‌డిని పోలీసులు విచారిస్తున్నారు. 
 
వాస్తవానికి,  సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త అని, మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు కూడా అని చెబుతున్నారు.  ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడని గుర్తు చేస్తున్నారు.
 
ఇలా ఉండగా, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించామని ఏపీ హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. అమలాపురం ఘటనపై డీజీపీతో సమీక్షించామని చెబుతూ  పోలీసులు ఆందోళనలను అదుపులోకి తెచ్చారని ఆమె చెప్పారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.