స్పైస్​జెట్ విమానాల సిస్టమ్స్ పై రాన్సమ్వేర్ దాడి

స్పైస్​జెట్​ విమానాల సిస్టమ్స్​పై రాన్​సమ్​వేర్​ అనే మాల్​వేర్​ దాడి జరిగింది. దీంతో సంస్థ సర్వర్ నెమ్మదించడంతో  బుధవారం ఉదయం బయలుదేరాల్సిన వందలాది విమానాలపై తీవ్ర ప్రభావం పడింది. విమానాలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. దీంతో వేర్వేరు ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు నిరీక్షించాల్సి వచ్చింది. 

పలు విమానాలు టేకాఫ్​ కావడంలో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ప్రయాణికులు బోర్డింగ్​ చెకప్​ క్లియరెన్స్​ అయ్యి,. విమానంలో కూర్చొన్న తర్వాత ఈ గందరగోళం తలెత్తింది. దీంతో నాలుగైదు గంటలపాటు విమానంలోనే ప్రయాణికులు వేచి ఉండవలసి  వచ్చింది.

బుధవారం ఉదయం జరిగిన ఈ ఆందోళనకర పరిస్థితిని చాలామంది తమ ట్విట్టర్​ ద్వారా విమానయాన శాఖ, స్పైస్​జెట్​ యాజమాన్యానికి తెలియజేశారు. దీనిపై స్పైస్​జెట్​ వివరణ కూడా ఇచ్చుకుంది. అయితే ఆహారం లేకుండా గంటలకొద్దీ విమానంలో కూర్చోవడం ఎంత నరకమో మీకు తెలుసా అంటూ  ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ  గందరగోళం తలెత్తింది. ఓ స్పైస్​జెట్​ విమానంలోని సిస్టమ్స్​పై రాన్​సమ్​వేర్​ మాల్​వేర్​తో దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఓ ప్రయాణికుడు తన ట్విట్టర్​లో ఈ విషయం పోస్టు చేయడంతో అది కాస్త బయటి ప్రపంచానికి తెలిసి ప్రయణికుల్లో ఆందోళన కలిగించింది. 

స్పైస్​జెట్​ ప్రయాణికుడు ముదిత్​ షెజ్వర్​ తాను టేకాఫ్​ కావడంలో ఫెయిల్యూర్​ అయిన విమానంలో ఉన్నానని ఆ ట్వీట్​లో పేర్కొన్నాడు. బోర్డింగ్​ ఫార్మాలిటీస్​ పూర్తయిన 80 నిమిషాల తర్వాత కూడా టేకాఫ్​ కాలేదని తెలిపాడు.

‘‘ధర్మశాలకు వెళ్లాల్సిన SG2345 విమానంలో మేము ఎక్కి ఇప్పటికే 80 నిమిషాలైంది. మేము ఇంకా టేకాఫ్ చేయలేదు. కొందరు సాఫ్ట్​వేర్​ సమస్య​ అని చెబుతున్నారు. సర్వర్ డౌన్ అయిందంటున్నారు. ఇంకొందరేమో ఇంధనం కోసం ఆగిందని అంటున్నారు. కానీ రాన్​సమ్​వేర్​ అటాక్​ చేయడం వల్లే విమానం ఆగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది నిజమేనా” అని అతను ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్​ను స్పైస్‌జెట్​తో పాటు  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అథారిటీని ట్యాగ్ చేయడంతో కలకలం రేగింది. రెండు గంటల తర్వాత షెజ్వార్ ట్వీట్​కు స్పైస్​ జెట్​ సమాధానం​ ఇచ్చింది. ముందు రోజు రాత్రి  రాన్​సమ్​వేర్   దాడి కారణంగా బుధవారం ఉదయం నుంచి విమానాలు టేకాఫ్​ కావడం లేదు అని స్పైస్‌జెట్ తెలిపింది.

ప్రయాణికులందరూ ఆహారం​ లేకుండా దాదాపు 4 గంటల పాటు విమానంలో ఇరుక్కుపోయారని తెలుస్తోంది. ఫిర్యాదులతో బుధవారం మొత్తం స్పైస్‌జెట్ ట్విట్టర్​ హోరెత్తిపోయింది. జైపూర్, కాన్పూర్ విమానాశ్రయాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే కనిపించాయి.

ఇక్కడ ప్రయాణికులు విమానాల కోసం దాదాపు ఐదారు గంటల పాటు ఆహారం లేకుండా వేచి ఉండవలసి వచ్చింది. ప్రయాణికులు, స్పైస్‌జెట్ సిబ్బంది మధ్య వాగ్వాదం కూడా జరిగింది.  స్పైస్‌జెట్ కస్టమర్ కేర్ నంబర్‌లుకూడా  ఏవీ పనిచేయడం లేదని ప్రయాణికులు చాలామంది ట్విట్టర్‌లో ఫిర్యాదులు​ చేయడం ప్రారంభించారు.