అనర్హత వేటు ప్రశ్నే తలెత్తదు… రఘురామకృష్ణంరాజు

రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ను తానేమి ఉల్లంఘించలేదని, అటువంటప్పుడు తనపై అనర్హత వేటనే ప్రశ్నే తలెత్తదని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఐదు మంది ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని నిస్సిగ్గుగా తిరుగుతున్నా, వారిపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదని ఆయన  ప్రశ్నించారు.
ఇతర పార్టీ గుర్తుల పై గెలిచిన ఐదు మంది ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం ప్రజలకు తెలియదా? అని ఎద్దేవా చేశారు. తానేమీ పార్టీ మారలేదని, పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తే తనపై అనర్హత వేటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
పార్లమెంట్లో తాను విప్ ఉల్లంఘించిన ట్లు తప్పుడు మాటలు చెబుతున్నారని, అసలు ఇంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విప్ నే జారీ చేయలేదని గుర్తు చేశారు. విప్ నే జారీ చేయనప్పుడు, దిక్కరించానన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.
 
రాజ్యాంగంలోని 350 ఏ, అధికరణం ప్రకారం మాతృభాషను ప్రోత్సహించాలని, తాను అదే విషయాన్ని లోక్ సభ లో ప్రస్తావించానని తెలిపారు. టిడిపి లోక్ సభ సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ ఏపీలో మాతృభాష పట్ల వివక్ష కొనసాగుతోందని పేర్కొనగా, తాను స్పీకర్ అనుమతితో మాట్లాడుతూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి , తెలుగు అకాడమీ ఉన్నదని దానికి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి చైర్మెన్ గా కొనసాగుతున్నారని చెప్పానని గుర్తు చేశారు. 
 
అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తెలుగు అకాడమికి రావల్సిన నిధులను తక్షణమే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగు భాష పై చేస్తున్న దాష్టికాన్ని ప్రస్తావించకుండా, కొన్ని రాష్ట్రాలలో మాతృభాషపై వివక్ష కొనసాగుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకు వచ్చానని చెప్పారు. 
 
రాజ్యాంగంలోని 350 ఏ అధికరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని, హెచ్ ఆర్ డి ఎ మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. లోక్ సభలో తాను మాట్లాడిన మాటలు రికార్డులలో ఉంటాయని, ఇక తాను రాజ్యాంగాన్ని అవమానించినట్లు ఎలా అవుతుందని రఘురామకృష్ణంరాజు ఎదురు ప్రశ్నించారు. 
 
 ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక్కరేనని, అయితే పార్టీ అధ్యక్షుడినీ విమర్శిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారని రఘురామ తెలిపారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు తాము అధికారంలోకి వచ్చామని, అయితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. 
 
పార్టీ అధ్యక్షుని హోదాలో అధికారంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి గా మరో 20 ఏళ్ళ వరకు మధ్య నిషేధం అమలు అన్న ప్రస్తావనే లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నుంచి రూ  8,000  కోట్లు దారి మళ్లించి బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని ద్వారా 20 ఏళ్లలో వచ్చే ఆదాయానికి గాను రూ 40,000 కోట్లుఅప్పు చేయాలని చూస్తున్నారని తెలిపారు. 
 
దీనితో రేపు వేరే ప్రభుత్వం ఏర్పడిన మద్య నిషేధం అమలుకు బ్యాంకర్ల నుండి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపోతే అధికారంలోకి వచ్చిన ఏడు రోజుల్లోనే సి పి ఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, సి .పి . ఎస్ రద్దు ప్రస్తావనే తీసుకు రావడం లేదని పేర్కొన్నారు. పీ ఆర్ సి ని సైతం పెంచుతామని ఉద్యోగులకు నమ్మబలికి, గత ప్రభుత్వాల కంటే తక్కువ పీఆర్సీని ఇచ్చారని విమర్శించారు. 
 
గత టిడిపి ప్రభుత్వం పై బాదుడే బాదుడు అంటూ విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు తాను చేస్తున్నది ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, విద్యుత్ చార్జీల పెంపు పై గతంలో అసెంబ్లీలో, బయట గొంతు చించుకున్న ఆయన విద్యుత్ ఛార్జీలను వంద శాతానికి పైగా పెంచారని ధ్వజమెత్తారు. ఇంకా కొన్ని శ్లాబుల వారికి 300 శాతం విద్యుత్ చార్జీలు పెరిగిందని తెలిపారు. 
 
 బస్సు చార్జీలు కొంచెం పెంచినట్టు గా సాక్షి దినపత్రికలో రాసుకున్నప్పటికీ, 40 శాతం చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని మండిపడ్డారు.  పోలీసుల దాష్టీకానికి భయపడి ప్రజలెవరూ మాట్లాడకపోయినా, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తనలాంటి వారు మాట్లాడితే తప్పు పట్టడం ఏమిటి ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తనకుందని… ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా తననే విమర్శిస్తున్నానని ఆయన భావిస్తే,పార్టీ విధివిధానాలను ఉల్లంఘిస్తున్నానని అనుకుంటే, తనని పార్టీ నుంచి బహిష్కరించ వచ్చని సవాల్ చేశారు. 
 
ఇలా ఉండగా, ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి ఎమ్యెల్సీ అనంత బాబు తన ఆగడాలతో, వీరప్పన్ ఇమేజ్ సంపాదించుకున్నారని రఘురామ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. రంగురాళ్లు, గంజాయి తరలింపు వ్యవహారాలు అనంత బాబు పాత్ర ఉన్నట్లు ప్రముఖ దిన పత్రికలలో కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. 
 
అయితే, రంగురాళ్లు, గంజాయి కుంభకోణంలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల ద్వారా అనంత బాబు కు ప్రాణహాని ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని హెచ్చరించారు. అనంత బాబు ఆగడాలపై ఎన్ ఐ ఏ చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.