పెద్దమ్మ ఆలయంలో ‘హలాల్’పై హిందూ సంఘాల ఆగ్రహం 

రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన  జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులు అత్యంత భక్త్రిశ్రధ్ధలతో మొక్కుబడిగా సమర్పించే జంతువులను హలాల్ పద్ధతిలో బలి ఇస్తున్న ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఇస్లామిక్ విధానంలో జంతువులను వధించే హలాల్ ప్రక్రియకు సంబందించిన బోర్డులు ఆలయంలో పెట్టడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని, అన్యమత ఆచారాలను ప్రచారం చేసే బోర్డు ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేయడం దారుణం అని హైందవ సంఘాల ఐక్య వేదిక నాయకులు పేర్కొన్నారు.

సోమవారం జూబ్లిహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి చేరుకున్న ఐక్యవేదిక సభ్యులు, అక్కడ హలాల్ ప్రక్రియను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణం తొలగించి ఆలయ పరిసరాల్లో హలాల్ నిషేదం విధిస్తూ ప్రకటన జారీ చేయాలని దేవస్థానం అధికారులను డిమాండ్ చేశారు. మొదటి దీనికి దేవస్థానం అధికారులు అంగీకరించకపోయినప్పటికీ చివరికి హిందూ సంఘాల ఒత్తిడితో వారి డిమాండులను అంగీకరించి ‘హలాల్’ బోర్డులను తొలగించారు.

హిందూ ఆలయాలలో హైందవేతర, హైందవ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే సహించేది లేదని, తెలుగు రెండు రాష్ట్రాలలోని ఏ ఆలయంలో కూడా ఇకపై హలాల్ బోర్డులు లేదా పద్దతి ఉండకూడదని, అందుకు విరుద్ధంగా ఏది జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైందవ సంఘాల ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు.