కేసీఆర్ ముక్త్ తెలంగాణే బిజెపి లక్ష్యం 

కేసీఆర్ ముక్త్ తెలంగాణే తమ లక్ష్యమని బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొంటూ చెప్పారు. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం, బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అని భరోసా వ్యక్తం చేశారు.

రైతులతో పాటు, అన్ని వర్గాల ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రజా సంగ్రామయాత్ర విజయవంతంలో ప్రతీ కార్యకర్త కృషి ఉందని అభినందించారు. టీఆర్ఎస్ సర్కార్ పోవాలని జనం కోరుకుంటున్నారన్న ఆయన బీజేపీ సర్కార్ రావాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. 

తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెబుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీవైపు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తి కోసం, కుటుంబం కోసం కాదు..దేశం కోసమే బీజేపీ ఉందని స్పష్టం చేశారు. 

వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ రైతుల నుండి ధాన్యం కొనాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రానిదే కదా… ఆ బాధ్యత నుండి కేసీఆర్ ఎందుకు తప్పుకుంటున్నారు? కేసీఆర్ రైతులకు చేస్తున్న ద్రోహం కాదా? ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. 
 
మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో ప్రజలకు ఏం చేసిందో… కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో ప్రజల్లోకి వెళదాం అని పిలుపిచ్చారు.  కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తక్కారు. డబుల్ బెడ్రూం ఇచ్చారా? ఉద్యోగాలిచ్చారా? బంగారు తెలంగాణ అయిందా? అవేమీ జరగలని గుర్తు చేశారు. 2023లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది… టీఆర్ఎస్ కథ ముగుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనను జనం అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. తండ్రీ కొడుకుల పాలనపై ప్రజలకు విశ్వాసం పోయిందని చెబుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకోని కేసీఆర్  పంజాబ్ రైతులకు సాయం చేసేందుకు వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. 

దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు వంద మంది కేసీఆర్ లు వచ్చినా ప్రధాని మోదీని ఏం చేయలేరని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. 2024లోనూ మోదీ సర్కారు మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సైన్స్ సిటీ నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇవ్వమని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

రైల్వే ప్రాజెక్టులకు భూ సేకరణ చేయకపోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే తెలంగాణాలో రైల్వే పనులు ముందుకు సాగడంలేదని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి  కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకలించి వేస్తామని హెచ్చరించారు. 

ఈ నెలాఖరు నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మే 30 నుండి జూన్ 14 వరకు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు సుపరిపాలనపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 

అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గడప గడపకూ వెళ్లి మోదీ ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలతో పాటు అవినీతి, అక్రమాలకు తావులేకుండా సుపరిపాలన అందించిన తీరు, భారత్ ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని వివరించాలని ఆయన కోరారు.

 జాతీయ సంఘటన సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, శాసనసభాపక్షనేత రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.