భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ది కీలకపాత్ర

భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ ది కీలకపాత్ర అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రెండు రోజుల జపాన్ పర్యటనకు సోమవారం టోక్యోకు చేరుకున్న ఆయన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తూ  భారత్, జపాన్ సహజ భాగస్వాములని, భారత దేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించిందని ప్రధాని తెలిపారు.
జపాన్‌తో మన బంధం అత్యంత గాఢత, ఆధ్యాత్మికత, సహకారం, పరస్పర అనుబంధంతో కూడినదని వివరించారు. స్వామి వివేకానందుడు చికాగోలో చారిత్రక ప్రసంగం ఇవ్వడానికి వెళ్లే ముందు జపాన్‌ను సందర్శించారని, జపాన్‌ ఆయన మనసుపై గాఢమైన ముద్రను వేసిందని ప్రధాని చెప్పారు.
జపనీయుల దేశభక్తి, ఆత్మవిశ్వాసం, పరిశుభ్రత పట్ల అవగాహనలను అరమరికలు లేకుండా వివేకానందుడు ప్రశంసించారని గుర్తు చేశారు.  మౌలిక సదుపాయాలను, సామర్థ్యాన్ని భారత దేశం ఏ విధంగా, ఎంత వేగంతో పెంచుకుంటోందో ప్రపంచం తెలుసుకుంటోందని చెప్పారు.
భారత దేశ సామర్థ్య నిర్మాణంలో జపాన్ ముఖ్య భాగస్వామి అని చెబుతూ ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్, ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లను ఉదహరించారు.
 
బుద్ధ భగవానుడి బాటలో నడవడం నేటి ప్రపంచానికి చాలా అవసరమని, మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం అదొక్కటేనని ప్రధాని తెలిపారు. గౌతమ బుద్ధుని ఆశీర్వాదాలు పొందడం భారత దేశ అదృష్టమని తెలిపారు. ఎంత పెద్ద సవాలుతో కూడుకున్న అంశంలోనైనా మానవాళికి భారత దేశం నిరంతరం సేవలందిస్తోందని స్పష్టం చేశారు. 
 
ఎటువంటి సవాలుకైనా భారత దేశం పరిష్కారాన్ని కనుగొంటుందని చెబుతూ కరోనాకు టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత దేశం ‘మేడ్ ఇన్ ఇండియా’ టీకాలను కోట్లాది మంది ప్రజలకు అందజేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిని 100కు పైగా దేశాలకు పంపించిందని తెలిపారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచం 100 ఏళ్ళలో అతి పెద్ద సంక్షోభంలో చిక్కుకుందని ప్రధాని పేర్కొన్నారు. అది మొదలైనపుడు తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. దానికి టీకా వస్తుందో, రాదో తెలియదని తెలిపారు. అలాంటి సమయంలో భారత దేశం ఇతర దేశాలకు మందులను పంపించిందని గుర్తు చేశారు. 
ప్రవాస భారతీయులు విదేశాల్లో ఉంటున్నా మాతృభూమిని మరువకపోవడం అతిపెద్ద బలమని తెలిపారు. అనేక సంవత్సరాల నుంచి జపాన్‌ లో స్థిరపడినప్పటికీ భారతీయులకు భారతీయ సంస్కృతి పట్ల అంకితభావం నిరంతరం వృద్ధి చెందుతోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.  
 
‘‘నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా, ఇక్కడి ప్రజల నుంచి గొప్ప ఆత్మీయతను పొందుతున్నాను. మీలో కొందరు అనేక సంవత్సరాల నుంచి జపాన్‌లో ఉంటున్నారు. ఈ దేశ సంస్కృతికి తగినట్లుగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ, భారతీయ సంస్కృతి, భాష పట్ల అంకితభావం నిరంతరం వృద్ధి చెందుతున్నాయి’’ అని మోదీ తెలిపారు. 
 
భారతీయులు తమ కర్మభూమి పట్ల మనసారా అనుబంధం ఏర్పరచుకుంటారని, అదే సమయంలో మాతృభూమి పట్ల ప్రేమను బలహీనపడనివ్వబోరని తెలిపారు. మనం మన జన్మభూమి నుంచి దూరం కాలేమని, ఇది మనకు గల గొప్ప బలాల్లో ఒకటి అని చెప్పారు. 
బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా, దృఢంగా మార్చిందని  మోదీ తెలిపారు. గత ఎనిమిదేళ్లలో మన ప్రజాస్వామ్యాన్ని బలంగా, దృఢంగా మార్చుకున్నామని చెబుతూ ఇది ప్రగతికి బలమైన స్తంభాలలో ఒకటిగా పనిచేస్తోంది అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చడానికి లీక్ ప్రూఫ్ పాలనను అందజేసే వ్యవస్థను మాత్రమే కలుపుకొని నిర్మించడానికి మేము కృషి చేస్తున్నామని వివరించారు. నేడు భారతదేశంలో నిజమైన అర్థంలో ప్రజల నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని చెప్పారు. భారత్‌లో ప్రజాస్వామ్యం పటిష్టం కావడానికి ఇదొక కీలక కారణం అని మోదీ తెలిపారు.
ఎన్ఈసీ  కార్పొరేషన్  ఛైర్మన్‌‌తో భేటీ
రెండ్రోజుల జపాన్ పర్యటనలో భాగంగా  ఎన్ఈసీ కార్పొరేషన్ ఛైర్మన్ నోబుహిరో ఎండోతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. టెలీ కమ్యూనికేషన్ రంగంలో ఎన్ఈసీ పాత్రను ప్రధాని ప్రశంసించారు. భారత్ లో అభివృద్ధి చెందుతున్నటెక్నాలజీల గురించి  ఎన్ఈసీ   ఛైర్మన్ తో మోదీ  చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
యూనిక్లో సీఈవో తదాషి యానే తో టెక్స్ టైల్ మార్కెట్, టెక్స్ టైల్ ప్రాజెక్టుల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద..  పెట్టుబడి అవకాశల గురించి చర్చించారు. సుజుకి మోటర్ కార్పొరేషన్ సలహాదారు ఒసామ్ సుజుకీ, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ మసయోషి సన్ లతో కూడా  సమావేశమయ్యారు.