వైసిపి ఎమ్యెల్సీ హంతకుడిగా నిర్ధారణ!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన తన వద్ద డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తిని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ యే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. శవపరీక్ష నివేదికలో మొదట్లో ఎమ్యెల్సీ అతని కుటుంభం సభ్యులకు చెప్పిన్నట్లు రోడ్ ప్రమాదంలో చనిపోలేదని, ఉద్దేశ్యపూర్వకంగా చంపినట్లు వెల్లడైనది.  మరోవంక,   పోలీస్ విధారణలో తానే హత్య జరిపించినట్టు  అతను అంగీకరించాడని చెబుతున్నారు.
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే  డ్రైవర్  బ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ అనంతను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
 
‘అవును.. నేనే హత్య చేశాను.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు.. నేనొక్కడినే హత్య చేశాను. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రమణ్యంను హత్య చేశాను. నా వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. మొదట సుబ్రమణ్యంను కొట్టి బెదిరిద్దామనుకున్నా.. కానీ అదంతా అలా జరిగిపోయింది’ అని పోలీసు విచారణలో ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విచారణ అనంతరం ఇంటికొచ్చి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దగ్గర్నుంచి.. హత్యచేసి ఇంటికి మృతదేహాన్ని తరలిచినంత వరకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేసినట్లు సమాచారం. అయితే అరెస్ట్ చేసినట్లు కానీ, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు కానీ పోలీసులు ఎక్కడా ఇసుమంత కూడా మీడియాకు సమాచారం ఇవ్వలేదు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మాత్రం పైన చెప్పిన సంచలన విషయాలన్నీ బయటికొచ్చాయి.
 
ఇదిలా ఉంటే.. అసలెందుకు ఇలా హత్య చేయాల్సి వచ్చింది..? అనే విషయాలపై లోతుగా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు మృతుడి భార్య, తల్లిదండ్రుల ఆరోపణలపైన కూడా పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. 
 
శవపరీక్షలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతో పాటు గొంతు మీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. 
 
కాగా.. అనంత బాబును అరెస్ట్ చేసి, బాధిత  కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మొదట్నుంచీ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే అనంత బాబు విషయంలో మాత్రం వైసీపీ నేతలు పెద్దగా స్పందించక పోవడం ఆసక్తి కలిగిస్తున్నది. 
 
 అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్‌ ను వెంటనే తన పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని, దళిత యువకుడి మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్షాలు, దళిత, ప్రజా సంఘాలు, ఇతరుల నిరసనలు హోరెత్తించాయి. వెంటనే అనంతబాబును అరెస్టు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అనంతబాబు పోలీసుల ఎదుట ఎమ్మెల్సీ లొంగిపోయినట్లు తెలుస్తోంది.