కాంగ్రెస్ లో భగ్గుమన్న కుమ్ములాటలు … దయాకర్ పై దాడి!

తెలంగాణ కాంగ్రెస్ లోని కుమ్ములాటలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దళిత ఉద్యమకారుడు అద్దంకి దయాకర్‌పై దాడి ఘటనతో ఆ పార్టీలో వ్యవహారాలు మరోసారి రోడ్ మీద పడ్డాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో  ఈ సంఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ మౌనం వహించడం గమనార్హం.
జిల్లా  కాంగ్రెస్లో కీలక నేత, మా మంత్రి జీ  రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గానికి, అద్దంకి దయాకర్ వర్గానికి మధ్య కొంత కాలంగా సాగుతోన్న ఆధిపత్యపోరు ఈ దాడికి దారితీసిన్నట్లు చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ కొండరాజు వివాహ వేడుకలో పాల్గొనేందుకు దయాకర్ ఆదివారం నాడు తుంగతుర్తికి రాగా, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆయనను అడ్డుకున్నారు.
తోపులాటలో వైరి వర్గీయులు దయాకర్ చొక్కా పట్టుకుని లాగేసి, కొట్టబోయారు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటన కాంగ్రెస్ లో కలకలానికి దారితీసింది.అధికారంలో లేకపోయినా అంతర్గత పోరులో మాత్రం తామే ముందుంటామని కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు.
ఐక్యంగా పనిచేయాలంటూ రాష్ట్ర పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ హితోపదేశం చేసిన పక్షం రోజులకే   బహిరంగంగా దాడులకు  కాంగ్రెస్ నేతలు తెగబడ్డారు. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో అద్దంకి దయాకర్‌‎పై దామోదర్‌రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దౌర్జన్యంకు దిగిన్నట్లు భావిస్తున్నారు.
అద్దంకి దయాకర్‌పై జరిగిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. దామోదర్ రెడ్డి వర్గీయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. కొద్ది రోజుల కిందట దయాకర్.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా సొంత పార్టీ నేతలైన దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై విమర్శలు చేశారు. 
 
ఇందుకుగానూ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆయనకు నోటీసులు జారీచేయగా, దయాకర్ వివరణ ఇచ్చుకున్నారు. చర్యలేవీ లేకపోవడంతో ఇక వివాదం సర్దుమణిగినట్లేననే సంకేతాలొచ్చినా, తాజా దాడితో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.
 
2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంపై పట్టు నిలుపుకొనే లక్ష్యంతో దామోదర్ రెడ్డి తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. తర్వాతి కాలంలో దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి.