కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం వల్లే పెట్రో ధరలు తగ్గించారనడం సిగ్గుచేట

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారనడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను ఆదుకోవడం వదిలేసి, పంజాబ్ రైతులను కలుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా బీజేపీ భయపడదని స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రజల నుంచి కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదని హెచ్చరించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై సెస్ తగ్గించాలని కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్, డీజిల్ పై పన్నులు వసూలు చేస్తోందని పేర్కొన్నారు.

కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక పరిస్థితులతో పాటు ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని, ఆ ప్రభావం అమెరికా వంటి దేశాలతో పాటు భారత్ పై కూడా పడిందని ఆయన చెప్పారు.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేసీఆర్ కు కనీస అవగాహన లేదని  కిషన్ రెడ్డి విమర్శించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామన్న వాగ్దానం ఏమైందని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి, కేంద్రానికి కేసీఆర్ సర్టిఫికేట్ అక్కర్లేదని హితవు చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తానని గతంలో ఎన్నో సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పారని, అవన్నీ ప్రగతిభవన్ కే పరిమితం అవుతాయని ఎద్దేవా చేశారు. 

కాగా, రాజా రామ్మోహన్ రాయ్ 250 జన్మదినోత్సవాన్ని తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా, కిషన్ రెడ్డిని  ఇగురం రచయిత గంగాడి సుదీర్  మర్యాద పూర్వకంగా కలిసి ఇగురం కథాసంపుటి మలి ముద్రణ లోని తొలి కాపీని అందజేశారు.

తొలి ముద్రణ లోని వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కాకుండా, త్వరలోనే విడుదల  అయ్యే మలి ముద్రణ తొలికాపీ అందుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇగురం పేరు తెలంగాణకే ప్రత్యేకమని, సుధీర్ రచనలు కూడా అలాగే ప్రత్యేకంగా ఉంటాయని మంత్రి అభినందించారు.