ప్రపంచ ఛాంపియన్ గా తెలంగాణ బాక్సర్ నిఖత్

తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. 52 కేజీల ఫ్లయ్‌ వెయిట్‌ కేటగిరీలో జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో నిఖత్‌ ‘పంచ్‌’కు ఎదురే లేకుండా పోయింది. 
 
గురువారం థాయ్‌లాండ్‌ బాక్సర్‌ జిత్‌పాంగ్‌ జుతమాస్‌తో జరిగిన టైటిల్‌ పోరులో తెలంగాణ తేజం జరీన్‌ 5–0తో జయభేరి మోగించిది. తనపై భారతావని పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా ‘పసిడి’పతకం తెచ్చింది. ఒక్క ఫైనల్లోనే కాదు  ప్రతీ బౌట్‌లోనూ నిఖత్‌ పట్టుదలగా ఆడింది.
 
తనకెదురైన ప్రత్యర్థులపై కచ్చితమైన పంచ్‌లు విసురుతూ పాయింట్లను సాధించింది. ఫైనల్లోనూ ఆమె పంచ్‌లకే జడ్జీలంతా జై కొట్టారు. మూడు రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్‌లో జరీన్‌ ఆధిపత్యమే కొనసాగింది.  దీంతో జడ్జీలు 30–27, 29–28, 29–28, 30–27, 29–28లతో తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చారు. భారత్‌ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌ రికార్డులకెక్కింది. 
 
మేరీకోమ్‌ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్‌ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది.  నిఖత్‌ స్వస్థలం నిజామాబాద్‌. ఆమె కెరీర్‌ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్‌ అహ్మద్‌ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. 

అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్‌ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్‌ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్‌ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్‌ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్‌ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది.

ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్‌ జూనియర్‌ స్థాయిలో బెస్ట్‌ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది.  ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్‌ 2011లో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. 

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్‌ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్‌ కప్, థాయిలాండ్‌ ఓపెన్‌లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్‌ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్‌ తారగా గుర్తింపు దక్కింది.

పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్‌ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. 

ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో  నిజామాబాద్‌ కు చెందిన నిఖత్‌ జరీన్‌ విశ్వ విజేతగా నిలవడం  పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్‌ జరీన్‌ ను మనస్ఫూర్తిగా అభినందించారు.

చరిత్ర సృష్టించిన మన ఇందూరు బిడ్డ, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. సంచలన విజయం సాధించి ఆమె భారత బాక్సీగ లో సరికొత్త శిఖరాన్ని అధిరోహించినదని కొనియాడారు. ప్రపంచ బాక్సర్ ఛాంపియన్ గా నిలిచినా తొలి తెలుగుబిడ్డ కావడం గర్వకారణం అని పేర్కొన్నారు.