తెలంగాణ భారత్ లో భాగం కాదన్నట్లు కేసీఆర్ ధోరణి

తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో భాగం కాదన్న రీతిలో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ తీరును బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ ప్రశ్నించారు. 
కేంద్రం పల్లెలకు నేరుగా నిధులు ఇచ్చే విషయాన్ని చిల్లర వ్యవహారం అని ముఖ్యమంత్రి అనడం దేనికి సంకేతం అని ఆమె నిలదీశారు. 
 
కేసీఆర్  వ్యాఖ్యలు చూస్తే మన రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావిస్తున్నారా అని అనుమానం వస్తుందని అరుణ ధ్వజమెత్తారు.  స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేసిన నియంత ముఖ్యమంత్రి అని ఆమె మండిపడ్డారు. 
 
అటువంటి సీఎం కేంద్రం పై వ్యాఖ్యలు చేయడం దొంగనే, దొంగా దొంగా అనట్లు ఉందని అరుణ విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయో తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ నిధులతో , మీరు గ్రామాలలో వేసే రోడ్లు కూడా కనీసం స్థానిక స్థానిక ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా , తీర్మానాలు లేకుండానే మీ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి కట్టబెడుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. 
 
ఇలా ఉండగా, కేసీఆర్ పంజాబ్ పర్యటనపై అరుణ విస్మయం వ్యక్తం చేశారు. కన్న తల్లికి తిండి పెట్టనొడు , చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్లు ఉందని ఆమె ఎద్దేవా చేసారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ ఇవ్వడం లేదని,, ఆత్మహత్యలు చేసుకున్న వారికి కనీసం పరామర్శ లేదని, కానీ పక్క రాష్ట్రంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి బయలుదేరుతున్నాడని అంటూ  అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారశైలి కేవలం జాతీయ స్థాయిలో ప్రచారం పొందడానికే తప్పా మరొకటి కాదని ఆమె స్పష్టం చేశారు.  చిత్తశుద్ధి ఉంటే ముందు తెలంగాణ రైతులకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలు రుణమాఫీ చేయండని ఆమె నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి తర్వాత ఇతరులను ఆదుకోండి అని హితవు చెప్పారు. 
 
కేసీఆర్ వాఖ్యలు దురదృష్టకరం 
 
కేసీఆర్ వాఖ్యలు దురదృష్టకరం అంటూ  నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు బదలాయించాలన్నదే 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. విద్య,  వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా వాటిపై ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్‌ది చిల్లర బుద్ది కాక ఏమనాలి? అంటూ ప్రశ్నించారు. 
 
  గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కమీషన్ల కోసం కక్కుర్తిపడి పక్కదారి పట్టిస్తూ… గ్రామాలను పూర్తిగా నీరుగారుస్తున్నది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. 
 
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కేసీఆర్ చేతగానితనం వల్ల సర్పంచులు ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులపాలై ఉపాధి కూలీలుగా, వాచ్‌మెన్లుగా, సెక్యూరిటీ ఉద్యోగులుగా కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.