కర్ణాటక మత స్వేచ్ఛ బిల్లుకు గవర్నర్ ఆమోదం

 కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు పరిరక్షణ బిల్లును ఆర్డినెన్సు గా తీసుకు రావడానికి ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మంగళవారం ఆమోదం తెలిపారు. దీంతో ఈ చట్టం వెంటనే అమల్లోకి వచ్చింది. ఈ బిల్లును శాసన సభ గత డిసెంబరులో ఆమోదించింది. అయితే శాసన మండలి ఆమోదం ఇంకా పొందలేక పోవడంతో ఆర్డినెన్సు గా తీసుకు రావాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 
 
మత మార్పిడి నిరోధక చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఇప్పుడు కర్ణాటక తొమ్మిదోది.  తప్పుడు వివరణ, బలవంతం, మోసం, అనుచిత ప్రలోభాలు, నిర్బంధం, లేదా, పెళ్లి వంటి కారణాలతో ఒక మతం వారు మరొక మతంలోకి మారడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది.మతస్వేచ్ఛను రక్షించడం,  తప్పుగా సూచించడం, బలవంతం, మితిమీరిన ప్రభావం, బలవంతం, ఆకర్షణ లేదా ఏదైనా మోసపూరిత మార్గాల ద్వారా ఒక మతం నుండి మరొక మతంలోకి చట్టవిరుద్ధంగా మారడాన్ని నిషేధించడం కోసమే ఈ ఆర్డినెన్సు తీసుకు వస్తున్నట్లు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

“కర్ణాటక శాసనసభ, కర్నాటక శాసన మండలి సమావేశాలలో లేనందున, కర్నాటక గౌరవనీయ గవర్నర్ సంతృప్తి చెంది, ఇకపై కనిపించే ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌ను ప్రకటించడానికి తక్షణమే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని’, గెజిట్ నోటిఫికేషన్ పేర్కొన్నది.

ఈ చట్టం ప్రకారం నేరానికి పాల్పడినవారికి కనీసం మూడేళ్ళ నుంచి గరిష్ఠంగా ఐదేళ్ళ వరకు  జైలు శిక్ష విధించవచ్చు, అంతేకాకుండా రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు. మైనర్‌, మహిళ, షెడ్యూల్డు కులాలు లేదా షెడ్యూల్డు తెగలకు చెందినవారిని చట్టవిరుద్ధంగా మతం మార్చిన వారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు.
ఈ చట్టానికి వ్యతిరేకంగా సామూహిక మతమార్పిడులకు పాల్పడినవారికి 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1,00,000 వరకు జరిమానా విధించవచ్చు.  మతం మారాలనుకునేవారు కనీసం 60 రోజులు ముందుగా డిప్యూటీ కమిషనర్‌కు తెలియజేయాలని ఈ చట్టం చెప్తోంది. మతం మారిన తర్వాత 30 రోజుల్లోగా ఆ విషయాన్ని తెలియ జేయాలని పేర్కొంది.
30 రోజులలోపు ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే,  ప్రతిపాదిత మార్పిడి నిజమైన ఉద్దేశ్యం,  కారణానికి సంబంధించి రెవెన్యూ లేదా సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల ద్వారా విచారణను జరపవలసి ఉంటుంది. “ఈ ఆర్డినెన్స్‌లోని నేరం విచారణ ఆధారంగా జిల్లా మేజిస్ట్రేట్ ఒక నిర్ధారణకు వస్తే, అతను సంబంధిత పోలీసు అధికారులు సెక్షన్ 3లోని నిబంధనలను ఉల్లంఘించినందుకు క్రిమినల్ చర్యను ప్రారంభించేలా చేస్తారు” అని ఆర్డినెన్స్ పేర్కొంది.
అంతేకాకుండా, ఈ ఆర్డినెన్స్ కింద గతంలో నేరానికి పాల్పడిన వారెవరైనా మళ్లీ ఈ ఆర్డినెన్స్ కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష విధించబడటంతో పాటు   రూ.2 లక్షల  జరిమానా కూడా విధించబడుతుంది. ఈ ఆర్డినెన్స్ కింద చేసిన నేరాలు గుర్తించదగినవి , బెయిల్ కు అర్హమైనవి కావు.
ఇదిలావుండగా,  బెంగళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మచడో సోమవారం గవర్నర్‌ గెహ్లాట్‌ను కలిసి, ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని కోరారు. ప్రజల హక్కులకు, మరీ ముఖ్యంగా మైనారిటీల హక్కులకు ఈ బిల్లు విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు.