కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చొరబాట్లను అడ్డుకోండి

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేందుకు సరిహద్దుల్లో చొరబాట్లు లేకుండా చూడమని భద్రతా దళాలను  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అందుకు చెబడుతున్న   ప్రో-యాక్టివ్ కోఆర్డినేటెడ్ కార్యకలాపాలను ఆయన  సమర్థించారు. అక్కడ పరిస్థితిని సమీక్షించడానికి, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించడానికి, భద్రతా బలగాలను నిర్ధారించడానికి ఉన్నతాధికారులతో మూడు అత్యున్నత స్థాయి సమావేశాలను ఆయన వరుసగా జరిపారు.

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , పోలీసు చీఫ్ దిబాగ్ సింగ్,   ఇతర కేంద్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశాలలో పాల్గొన్నారు.  జూన్ 30 నుండి ప్రారంభమయ్యే ఈ ఏడాది 42 రోజుల పాటు జరిగే అమరనాథ్ యాత్రలో మొదటిసారిగా భక్తులకు రూ. 5 లక్షల బీమా రక్షణతో పాటు ప్రతి యాత్రికుడికి ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 ఇంతకు ముందు వాహనాలకు మాత్రమే ఆర్‌ఎఫ్‌ఐడీ అందించేవారు.

కేంద్రపాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా పాల్గొన్నారు.  భద్రతా బలగాలు,  పోలీసులను సమన్వయంతో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చురుగ్గా నిర్వహించాలని హోం మంత్రి ఆదేశించినట్లు అధికారిక ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

సుసంపన్నమైన, శాంతియుతమైన జమ్మూ కాశ్మీర్‌గా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చేందుకు, కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టేందుకు భద్రతా బలగాలు సరిహద్దు చొరబాట్ల జరగకుండా చూడాలని హోంమంత్రి చెప్పారు.

యాత్రికుల కోసం “అవాంతరాలు లేని” ప్రయాణం మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత అని అమిత్  షా తెలిపారు. అవసరమైన  విద్యుత్, నీరు మరియు టెలికాం సౌకర్యాలతో సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొండచరియలు విరిగి పడినప్పుడు మార్గాన్ని క్లియర్ చేయడానికి అవసరమైన పరికరాలను కీలక ప్రదేశాలలో ఉంచాలని చెప్పారు.  యాత్ర మార్గంలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరచాలని కూడా ఆయన స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి తర్వాత ఇది మొదటి యాత్ర అని, అధిక ఎత్తులో ఉన్నందున, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న యాత్రికుల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అమిత్ షా తెలిపారు.  ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, 6,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మెడికల్ బెడ్‌లు, అంబులెన్స్‌లు, హెలికాప్టర్‌లను మోహరించాలని హోం మంత్రి సూచించారు.

అమర్‌నాథ్ యాత్రలో ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని వర్గాల రవాణా సేవలను పెంచాలని చెప్పారు.  ఈ సమావేశంలో, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ నుండి యాత్ర మార్గంలోని 39 కి.మీ పొడవునా కనెక్టివిటీని నిర్ధారించడానికి వైఫై హాట్‌స్పాట్‌లను ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఇతర మార్గం మధ్య కాశ్మీర్‌లోని బాల్తాల్ గుండా దాదాపు 15 కి.మీ. యాత్రికులు ట్రెక్కింగ్ చేస్తారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020, 2021లలో అమరనాథ్  యాత్ర జరగలేదు.  ఆర్టికల్ 370 రద్దుకు ముందు 2019 లో యాత్రను మధ్యలో ఆపివేశారు. అందుకనే ఈ సంవత్సరం పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. ఆగస్టు 11న ముగియనున్న ఈ యాత్రలో దాదాపు మూడు లక్షల మంది యాత్రికులు పాల్గొనే అవకాశం ఉంది.

జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు దాదాపు 12,000 మంది పారా మిలటరీ సిబ్బందిని (120 కంపెనీలు) రెండు తీర్థయాత్ర మార్గాల్లో మోహరించాలని భావిస్తున్నారు. ఒక మార్గం పహల్గామ్ నుండి కాగా,  మరొకటి బాల్తాల్ మీదుగా. యాత్రికుల రక్షణకు డ్రోన్ కెమెరాలు భద్రతా దళాలకు సహాయపడతాయి. అమర్‌నాథ్ యాత్రతో పాటు, కాశ్మీర్‌లో కాశ్మీరీ పండిట్‌లతో సహా అనేక లక్ష్య హత్యల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కూడా ఈ సమావేశాలలో సమీక్షించారు. 


జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 2019లో రద్దు చేసినప్పటి నుంచి కాశ్మీర్ లోయలో నివసిస్తున్న ముస్లిమేతరులు, బయటి వ్యక్తులపై దాడులు పెరిగాయి. కేంద్రపాలిత ప్రాంతంలో అనేక హత్యలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా సమీక్ష జరిగింది. 
 
మే 12న బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్‌ని తన కార్యాలయంలోనే ఉగ్రవాదులు హతమార్చారు. ఒక రోజు తర్వాత, పుల్వామా జిల్లాలోని అతని నివాసంలో పోలీసు కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ థోకర్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

గత వారం కూడా, జమ్మూలోని కత్రా సమీపంలో వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో నలుగురు యాత్రికులు మరణించారు.  కనీసం 20 మంది గాయపడ్డారు. మంటలు చెలరేగేందుకు స్టిక్కీ బాంబును వినియోగించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

భట్ హత్యతో కాశ్మీరీ పండిట్లు నిరసనలకు దిగారు. తమకు లోయలో భద్రతను పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు.