గోధుమల ఎగుమతులపై నిషేధాజ్ఞల సడలింపు

కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపు నిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. 
 
ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.  ఈజిప్టునకు వెళ్ళే గోధుమల కన్‌సైన్‌మెంట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్‌సైన్‌మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు.
ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఆ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయవచ్చునని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది.  అదే విధంగా రద్దు చేయడానికి వీలు కానటువంటి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈ నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకు ముందు జారీ చేసినట్లయితే, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించి, ఎగుమతి చేయవచ్చునని తెలిపింది.
గోధుమల ఎగుమతిపై భారత దేశం నిషేధం విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం వీటి ధరలు 6 శాతం పెరిగాయి. మన దేశంలో 4 నుంచి 8 శాతం వరకు తగ్గిపోయాయి. రాజస్థాన్‌లో క్వింటాలు గోధుమల ధర రూ.200 నుంచి రూ.250 వరకు తగ్గింది. పంజాబ్‌లో రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింది. ఉత్తర ప్రదేశ్‌లో రూ.100 వరకు తగ్గింది.
అన్ని రకాల గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం శనివారం నిషేధం విదించిన సంగతి తెలిసిందే. అత్యధిక ప్రొటీన్ ఉండే గోధుమలు, సాధారణ సాఫ్ట్ బ్రెడ్ రకాల గోధుమల ఎగుమతులను కూడా నిషేధించింది. 
 
ఇలా ఉండగా, గోధుముల ఎగుమతులపై భారత్  విధించిన ఆంక్షలకు అనూహ్యంగా చైనా మద్దతు తెలిపింది. భారత్‌ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్‌ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్‌ చేసింది. 
ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్‌ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది.