జ్ఞానవాపి మసీదులో శివలింగం ప్రాంతంకు భద్రత … సుప్రీం ఆదేశం

ఉత్తరప్రదేశ్‌లోని వారాణసీలో జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని ఓ బావిలో శివలింగం బయటపడిన ఘటనపై  వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. ముస్లింలను జ్ఞానవాపి మసీదు నమాజ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. 
 
అదే సమయంలో శివలింగం బయటపడిన ప్రాంతానికి భద్రత కల్పించాలని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించింది.  దీనిపై పూర్తిస్థాయిలో వారాణాసి ట్రయల్ కోర్టులో విచారణ పూర్తయిన తరువాత పరిశీలిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.
జ్ఞానవాపి మసీద్‌ కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్‌ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  అంజుమాన్‌ ఇంతెజమీయా మసీద్‌ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడా సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
 
అంతకు ముందు జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ వీడియో సర్వే నివేదికను ఈ నెల 19 లోగా సమర్పించాలని వారణాసి న్యాయస్థానం ఆదేశించింది. సర్వేకు నేతృత్వం వహించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రాను తొలగిస్తున్నట్లు వారణాసి కోర్టు తెలిపింది. సర్వే రిపోర్ట్‌ పూర్తికాకుండానే బయటపెట్టినందుకు ఆయన్ని తొలగించినట్లు తెలుస్తోంది.
అజయ్‌ మిశ్రా సన్నిహితుడు.. మీడియాకు రిపోర్ట్‌ లీక్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది.  వాస్తవానికి ఈ కమిటీ ఇవాళే (మంగళవారం) వారణాసి కోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నివేదిక ఆలస్యంగా సమర్పిస్తామని అజయ్‌ కుమార్‌ మిశ్రా కోర్టుకు వెల్లడించారు. ఈలోపే ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడడం విశేషం.