మథుర మసీదులో నమాజ్ ఆపమని పిటిషన్

ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న షాహీ ఈద్గా మసీదు వాస్తవానికి శ్రీకృష్ణ జన్మస్థానమని, ఈ మసీదులో నమాజు చేయకుండా నిరోధించాలని స్థానిక కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ మసీదు నిర్మించడానికి ముందు ఈ స్థలంలో దేవాలయం ఉండేదని పిటిషనర్లు తెలిపారు. 
 
జ్ఞానవాపి మసీదుపై చర్చ కొనసాగుతున్న తరుణంలో ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.  పిటిషనర్ల తరపు న్యాయవాది శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ, హిందూ దేవాలయం అవశేషాలపై ఈ మసీదును నిర్మించారని చెప్పారు. ఇది దేవాలయమని, ఈ నిర్మాణంపై  మసీదు ఉండటంలో ఔచిత్యం లేదని చెప్పారు.
ఈ మసీదులో ప్రార్థనలు చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని కోరినట్లు తెలిపారు. శ్రీకృష్ణుని దేవాలయంలో కొంత భాగాన్ని మొఘలు చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం ఈ మసీదును నిర్మించారని హిందూ సంస్థలు చాలా కాలం నుంచి చెప్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ మసీదును తొలగించాలన్నారు.
ఈ పిటిషన్‌ను న్యాయవాదులు మహేంద్ర ప్రతాప్ సింగ్, రాజేంద్ర మహేశ్వరి దాఖలు చేశారు. ఈ మసీదును మూసివేయకపోతే మతపరమైన స్వభావం మారిపోతుందని తెలిపారు. దీనిపై జూలై ఒకటిన విచారణ జరుపుతామని సీనియర్ డివిజన్ కోర్టు సివిల్ జడ్జి తెలిపారు.
ఈ మసీదును తొలగించాలని కోరుతూ గతంలో 10 పిటిషన్లు మథుర కోర్టులో దాఖలయ్యాయి. ఈ మసీదు పక్కన శ్రీకృష్ణ దేవాలయం ఉంది. మసీదు ప్రాంగణం కూడా ఈ దేవాలయంలో భాగమేనని హిందూ సంస్థలు చెప్తున్నాయి.  ఇటీవల జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో మథుర దేవాలయం కూడా ఉంది. తాము మళ్ళీ అదికారంలోకి వస్తే మథుర దేవాలయాన్ని తిరిగి తీసుకొస్తామని తెలిపింది. మథుర శాసన సభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది.