కాంగ్రెస్ కు సునీల్ జాఖర్ రాజీనామా

ఓవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై “చింతన్ శివిర్”  నిర్వహిస్తుండగా మరోవైపు ఆ పార్టీకి సీనియర్ నేత, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖర్  షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి శనివారంనాడు రాజీనామా చేశారు.
 
ఫేస్‌బుక్‌లో ‘దిల్ కీ బాత్’ స్ట్రీమ్‌లో తన రాజీనామా ప్రకటన చేశారు. ”గుడ్ లక్…గుడ్ బై కాంగ్రెస్” అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ పంజాబ్ యూనిట్ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం తప్పించి నవజ్యోత్ సింగ్ సిద్ధూను పీపీసీసీ చీఫ్‌గా నియమించింది. 
 
పంజాబ్‌ ముఖ్యమంత్రి  పదవికి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా చేసిన తర్వాత జాకర్‌ సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పార్టీ ఎమ్మెల్యేలలో అత్యధికులు ఆయన పేరు సూచించారు.  కానీ, అధిష్టానం అందరికీ షాకిస్తూ ఛన్నీని సీఎం సీటులో కూర్చోబెట్టింది. దీంతో జాకర్‌ వివాదాస్పద వ్యాఖ‍్యలు చేసి వార్తల్లో నిలిచారు.
 
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో సిద్ధూ  సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొద్దికాలంగా సునీల్ జాఖర్ పరోక్షంగా కాంగ్రెస్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ  వస్తున్నారు. పంజాబ్‌లో అమరీందర్‌ సింగ్‌ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో తొలి దళిత ముఖ‍్యమంత్రిగా ఛన్నీని నియమించడంతో అధిష్టానాన్ని జాకర్‌ ప్రశ్నించారు.
ఆ తర్వాత పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ, ఛన్నీ ఓటమి చెందడంతో జాకర్‌ మరోసారి కాంగ్రెస్‌ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంతలో  అనూహ్యంగా ఆయన పార్టీకి రాజీనామా చేశారు.  సునీల్‌ జాఖఢ్‌ కుటుంబం 50ఏళ్లుగా కాంగ్రెస్‌ కు పనిచేస్తుంది. సునీల్‌ జాఖఢ్‌ పంజాబ్‌లోని అబోహర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.
పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా సునీల్‌ తండ్రి బలరాం జాఖఢ్‌ కాంగ్రెస్‌ తరఫున మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికవ్వడమే గాక.. రెండు పర్యాయాలు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా వంటి కీలక పదవులు నిర్వహించారు.