నియోజకవర్గాల పునర్విజనకు జనాభాయే ప్రాతిపదిక కాదు 

నియోజకవర్గాల పునర్విజన విషయంలో జనాభా అనేది కీలకమే అయినప్పటికీ, అదొక్కటే ఏకైక ప్రాతిపదిక మాత్రం కాదని జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు ప్రస్తావిస్తూ ప్రధాన ఎన్నికల కమీషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని ‘ఒకే యూనిట్’గా తీసుకున్నామని, తద్వారా  మొత్తం జనాభాకు 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
గతంలో డీలిమిటేషన్‌ ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని ఇప్పుడు సరిచేశామని ఆయన  చెప్పారు. డీలిమిటేషన్ ప్యానల్‌లో సుశీల్ చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. జనాభా రేషియా ప్రకారం జమ్మూతో పోలిస్తే కశ్మీర్ డివిజన్‌కు తక్కువ సీట్లు కేటాయించారంటూ కొన్ని వర్గాల్లో వినిపించిన విమర్శలపై ఆయన మరింత వివరణ ఇచ్చారు. 
 
 నియోజకవర్గాల పునర్విజన అనేది జనాభా ఆధారంగానే ఉంటుందని, అయితే దీనితో పాటు డీలిమిటేషన్ యాక్ట్, జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని ప్రొవిజన్ల ప్రకారం మరో నాలుగు ప్రాతిపదికలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫిజికల్ కండిషన్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, పబ్లిక్ కన్వీనియన్స్, ఏరియాల వారీగా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు వంటివి ఆ ప్రాతిపదికలని చెప్పారు.
 
 వీటిని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. జనాభా ఒక్కటే ఏకైక ప్రాతిపదిక కాదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టినట్టు వివరించారు. జమ్మూ కశ్మీర్‌ను ఒకే యూనిట్‌గా తీసుకున్నట్టు తెలిపారు.
జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ 2020 మార్చిలో ఏర్పాటైంది. మే 5న తుది నివేదికను నోటిఫై చేసింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను జమ్మూ డివిజన్‌కు 43 సీట్లు, కశ్మీర్‌కు 47 సీట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినప్పటి నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.