కశ్మీర్ పండిట్‌ను హత్య చేసిన ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌‌లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ పై గురువారం జరిగిన దాడిలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. బుధవారం కూడా ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
 
ఇదే జిల్లాలోని సలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు.  ఆ  రోజు పారిపోయిన వారే నేటి ఎన్‌కౌంట్‌లో హతమైనట్టు కశ్మీర్ ఐజీ తెలిపారు.  పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులైన వీరిద్దరూ ఈ నెల 11న జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి వీరిద్దరూ తప్పించుకున్నట్టు చెప్పారు. కశ్మీరీ పండిట్‌ను హత్య చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.
 
ఇలా ఉండగా, రాహుల్ భట్‌ను ఉగ్రవాదాలు కాల్చిచంపడంపై అతని భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణ చేసింది. తన భర్తను చంపేందుకు అతని కార్యాలయ సిబ్బంది ఉగ్రవాదాలతో కలిసి కుట్ర సాగించి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. 
ఎవరో తన భర్త గురించి అడిగినప్పుడు అవతల వాళ్లు చెప్పి ఉండకపోతే ఉగ్రవాదులకు రాహుల్ గురించి ఎలా తెలుస్తుందని ఆమె  ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి తనను బదిలీ చేయాలని పలు సందర్భాల్లో స్థానిక యంత్రాగానికి తన భర్త విజ్ఞప్తి చేశాడని, అయినప్పటికీ అతన్ని బదిలీ చేయలేదని ఆమె వాపోయింది.
కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని రాహుల్ భట్ తండ్రి డిమాండ్ చేశారు. “వచ్చిన వాళ్లు మొదట రాహుల్ భట్ ఎవరని అడిగారు. ఆ తర్వాతే అతనిపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలికి 100 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆఫీసులోనూ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఒక్కరు కూడా అక్కడ లేరు. సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే అసలు విషయం తెలుస్తుంది” అని ఆయన తెలిపారు.

పాక్ డ్రోన్ ను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

ఇలా ఉండగా, జమ్మూలోని సరిహద్దుల్లో శనివారం ఎగురుతున్న పాకిస్థాన్ డ్రోన్ ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తిప్పికొట్టింది. పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్ శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు జమ్మూలోని అర్నియాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో కనిపించింది.
 
దీంతో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్‌పై సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సైనికులు కాల్పులు జరిపారు.దాదాపు ఏడెనిమిది రౌండ్ల కాల్పులు జరిపామని,దీంతో డ్రోన్ తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.

కశ్మీర్‌లో ప్రొఫెసర్, టీచర్‌పై వేటు

జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాద సంబంధాలున్నాయనే అభియోగాలపై బర్తరఫ్ చేశారు. ఈ వేటుకు గురయిన వారిలో కశ్మీర్ యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహమ్మద్ మక్బూల్ హజామ్, టీచరు గులాం రసూల్ కూడా ఉన్నారు. 
 
బర్తరఫ్‌కు గురైన వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు ఎఎంఐ వార్తా సంస్థ అధికార వర్గాలను ఉటంకిస్తూ శుక్రవారం తెలిపింది. ఉగ్రవాద సంబంధాలున్నందున వారిపై రాజ్యాంగంలోని 344(2) సి అధికరణ పరిధిలో చర్యలు తీసుకున్నారు. గత ఏడాది మే నుంచి చూస్తే ఉగ్రవాద లింక్‌ల కారణంగా ప్రభుత్వం దాదాపు 40 మంది ప్రభుత్వోద్యోగులను సర్వీసుల నుంచి తీసివేసింది.