కేంద్రంపై తండ్రీ కొడుకుల విషప్రచారం

కేంద్రంపై తండ్రి కొడుకులు విషప్రచారం చేస్తున్నారని అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే లాగా కేసీఆర్ పాలన ఉందని..ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. 
 
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా  తుక్కుగూడ వద్ద కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శనివారం ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన దరఖాస్తులు పెరుకపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ లు ఇవ్వడం లేదని విమర్శించారు.

కల్వకుంట్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతూ అందుకు నిదర్శనం దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలే అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రంపై కేసీఆర్ విషం కక్కుతున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ రాజకీయాలు నడిపారని విమర్శించారు.

తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మరన్న కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని పేర్కొంటూ ఉత్తరప్రదేశ్, మణిపూర్ లలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు.

మోటర్లకు, మీటర్లు పెడతారని కేంద్రంపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెబుతూ.అకాల వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

కేసీఆర్ నియంతృత్వ ధోరణి వల్లే రైతులకు నష్టం జరిగిందన్న ఆయన రైతులకు కేంద్రం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక కేంద్రం తెలంగాణకు మెడికల్  కాలేజీలు ఇవ్వలేదన్న టీఆర్ఎస్ నేతల విమర్శలపై  కిషన్ రెడ్డి స్పందిస్తూ మెడికల్ కాలేజ్ కు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని పేర్కొన్నారు.

అసలు మెడికల్ కాలేజ్ కోసం కేంద్రానికి దరఖాస్తే పెట్టుకోలేదని చెప్పారు.కేంద్రం మీద విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మి చేసినట్లేనని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కాగా ఇటీవల వరంగల్ లో  కాంగ్రెస్ బహిరంగసభను ప్రస్తావిస్తూ ఆ పార్టీకే డిక్లరేషన్ లేదని, ఇక రైతులకు డిక్లరేషన్ ఎం చేస్తారని ఎద్దేవా చేశారు.

ప్రజల్లో పలచబడిన కేసీఆర్ ప్రభుత్వం 

కాగా, కేసీఆర్  ప్రభుత్వం ప్రజల్లో పలచబడిందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని మరిచి రాజ్యం మాదిరిగా కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ పాలనా సాగుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయటానికే బండి సంజయ్ )పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. పాదయాత్ర 

కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎలా మాటలు చెప్తున్నారని టక  ప్రశ్నించారు. ప్రధాన మంత్రిని కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని,  సర్కార్‌పై ప్రజలు కన్నెర్ర  చేస్తున్నారని రాజేందర్ ధ్వజమెత్తారు.