పార్టీ కోసం, ప్రభుత్వం కోసం సమానంగా పని చేస్తున్న ఏకైక నేత మోదీ

అటు పార్టీ కోసం, ఇటు ప్రభుత్వం కోసం సమాన స్థాయిలో గొప్ప అంకితభావంతో పని చేస్తున్న ఏకైక నేత ప్రధాని నరేంద్ర మోదీయేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా  తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో పని చేస్తున్న పార్టీగా  ఎదిగినట్లు ఆయన కొనియాడారు. 
 
 ‘మోదీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ మోదీ  నాయకత్వంపై భారతీయులకు గొప్ప నమ్మకం ఉందని, వారు తమ మనసు లోతుల నుంచి ఆయనను ప్రేమిస్తున్నారని అమిత్ షా చెప్పారు. 
 
ఆయన ఎటువంటి కుటుంబ నేపథ్యం లేకుండానే దేశ నాయకునిగా ఎదిగారని, ఇది చాలా ముఖ్యమైన విషయమని ఆయన తెలిపారు. ఆయన నాయకత్వంలో బీజేపీ అన్ని ప్రాంతాలకు విస్తరించిందని, పైగా   పార్టీపై ప్రచారమైన అనేక ప్రతికూల అంశాలు పటాపంచలయ్యాయని ఆయన పేర్కొన్నారు. 
 
బీజేపీ అంటే హిందీ మాట్లాడేవారి పార్టీ అని, కేవలం పట్టణ ప్రాంతాల్లోనే దీనికి పలుకుబడి ఉందని, రైతుల పార్టీ కాదని జరిగిన ప్రచారాలను ఆయన నాయకత్వంలో తిప్పికొట్టగలిగినట్లు తెలిపారు.  మోదీ ప్రభుత్వం ప్రజలు ఇష్టపడటం కోసం కాకుండా, వారికి శ్రేయస్సు కలిగించే నిర్ణయాలను ఎటువంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తీసుకుంటుందని అమిత్ షా చెప్పారు.
అద్భుతాలు, కుటుంబ నేపథ్యం, రాజకీయ ప్రాపకం వంటివేవీ లేకుండానే 2014లో మోదీకి భారీ స్థాయిలో ప్రజా తీర్పు వచ్చిందని అయన గుర్తు చేశారు. 2019లో మరోసారి ప్రజాతీర్పు ఇవ్వడం ద్వారా  మోదీని తమ నాయకునిగా ప్రజలు ఆమోదించారని స్పష్టమవుతోందని అమిత్ షా తెలిపారు.

ఈ పుస్తకంలో మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని తెలియజేస్తుందని చెప్పారు.  ఆటోల్లో, బస్సుల్లో ప్రతి గ్రామానికి తిరిగి.. పేద వారితో కలిసి భోజనం చేసిన అనుభవశాలి మోదీ అని కొనియాడారు. మోదీ  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి కనీసం గ్రామాన్ని పాలించిన అనుభవం కూడా లేదని ఆయన గుర్తు చేసారు.

కానీ, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో గెలిచి గుజరాత్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారని అమిత్ షా వివరించారు.  మోదీ దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కంటున్నారు.. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని వెంకయ్య నాయుడు అభినందించారు. 

బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంకలనం చేసిన ఈ గ్రంధంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత దేశ ప్రధాన మంత్రిగా 20 ఏళ్ళ నుంచి అమలు చేస్తున్న పరిపాలన విధానాన్ని ఈ పుస్తకంలో వివరించారు.  అమిత్ షా, అజిత్ దోవల్, సుధా మూర్తి, నందన్ నీలేకని, అరవింద్ పనగారియా, సుబ్రహ్మణ్యం జైశంకర్, లతా మంగేష్కర్, పీవీ సింధు, నృపేంద్ర మిశ్రా వంటివారు రాసిన వ్యాసాలను దీనిలో పొందుపరిచారు.