17 నాటికి జ్ఞానవాపి మసీదు సర్వే పూర్తి… కోర్ట్ ఆదేశం 

ఉత్తర ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దేవాలయం వద్ద ఉన్న జ్ఞానవాపి మసీదు వీడియో సర్వే కోసం నియమితుడైన కోర్టు కమిషనర్‌ను మార్చేందుకు వారణాసి కోర్టు గురువారం తిరస్కరించింది. ఈ సర్వేను మే 17  నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన రాఖీ సింగ్, లక్ష్మీ దేవి, సీతా సాహు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జడ్జి దివాకర్ ఈ మసీదు సర్వే, వీడియోగ్రఫీ కోసం ఆదేశించిన సంగతి తెలిసిందే. 
జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశుడు, హనుమంతుడు, నందీశ్వరులను ప్రతి రోజూ పూజించేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. వీరు గత ఏడాది ఏప్రిల్ 18న కోర్టును ఆశ్రయించారు. ఈ విగ్రహాలకు ఎటువంటి నష్టం చేయరాదని మసీదు కమిటీని ఆదేశించాలని కోరారు.  ఇదిలావుండగా, కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రా శుక్రవారం ఈ మసీదు వద్ద కొంత వరకు సర్వే చేశారు.
ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ముస్లింలు ఆరోపించారు. ఆయనను మార్చాలని కోరారు. అయితే కమిషనర్‌ను మార్చేందుకు కోర్టు తిరస్కరించింది.  కోర్టు కమిషనర్‌తోపాటు మరో ఇద్దరు న్యాయవాదులు విశాల్ సింగ్, అజయ్ సింగ్ లను కమిషనర్లుగా నియమించింది.  24 గంటల్లోగా మసీదు బేస్‌మెంట్‌ను తెరచి సర్వే ప్రారంభించాలని తెలిపింది. మే 17న సర్వే నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
కోర్ట్ ఉత్తరువుల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు సర్వే జరుపుతారు. మే 17 నాటికి సర్వే పూర్తి చేసి, కోర్టుకు నివేదిక సమర్పించమని ఆదేశించింది. కాగా, సర్వే జరపడానికి ఆటంకాలు కల్పిస్తూ ఉండడం పట్ల కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అటువంటి వారిపై కేసులు నమోదు చేయమని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
 
మా శృంగర్ గౌరీ స్థల్‌లో రోజువారీ దర్శనం, పూజకు అనుమతి కోరుతూ 2021 ఆగస్టులో వారణాసిలోని స్థానిక కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారణాసిలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవి కుమార్ దివాకర్ కోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 26న ఈద్ తర్వాత కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి మసీదు సముదాయం, ఇతర ప్రదేశాలలో ఆలయ అడ్వకేట్ కమిషనర్ ద్వారా వీడియోగ్రఫీని ఆదేశించింది.

సర్వే, తనిఖీ కోసం న్యాయవాది అజయ్ కుమార్‌ను కోర్టు నియమించింది. మే 10న తదుపరి విచారణకు ముందు నివేదిక సమర్పించాలని అడ్వకేట్ కమిషనర్‌ను కోర్టు కోరింది. కోర్టు ఆదేశాల ప్రకారం, మే 6,  7 తేదీల్లో మసీదు ఆవరణలో వీడియోగ్రఫీ, సర్వే నిర్వహించాలి.

 
 న్యాయవాది కమిషనర్, పార్టీలతో పాటు, విచారణ సమయంలో ఒక సహచరుడు హాజరుకావచ్చని కోర్టు పేర్కొంది. మే 6న సర్వే బృందం మసీదు వద్దకు వచ్చినప్పుడు, సభ్యులు కోర్టు ఆదేశాలను వ్యతిరేకించిన ముస్లింల భారీ నిరసనలను ఎదుర్కోవలసి వచ్చింది. తొలిరోజు కట్టుదిట్టమైన భద్రత నడుమ సర్వే జరిగింది.
 
 అయితే, నిరసనల కారణంగా మరుసటి రోజు తాత్కాలికంగా సర్వేను జిల్లా పాలనా యంత్రాంగం నిలిపివేసింది. ముస్లింల ప్రకారం, న్యాయవాది కమిషనర్ ఆదేశాలు లేకుండా జ్ఞానవాపి మసీదు లోపల వీడియోగ్రఫీ చేయడానికి ప్రయత్నించారు.  మసీదు నిర్వహణ కమిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ, మసీదు లోపల వీడియోగ్రఫీ చేయమని కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, మసీదు ప్రాంతాన్ని చుట్టుముట్టే బారికేడ్ల వెలుపల ‘చబుత్రా’ (ప్రాంగణం) వరకు మాత్రమే చేయాలని వాదించారు.