శ్రీలంక మాజీ ప్రధాని విదేశీ పర్యటనపై నిషేధం

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు నమల్ రాజపక్స, మరో 15 మందిపై శ్రీలంక కోర్టు ట్రావెల్ బ్యాన్ విధించింది. కొలంబోలో ఈ వారం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై జరిగిన హింసాత్మక దాడిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది.

ఆందోళనకారులకు భయపడి ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా నావికాదళం స్థావరంలో తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 

 అంతేకాదు ప్రధాని భవనం టెంపుల్‌ ట్రీస్‌ వద్ద  శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు.. ఆ తర్వాత చెలరేగిన హింస మీద దర్యాప్తు చేపట్టాలని పోలీస్‌ శాఖను మెజిస్ట్రేట్‌ ఆదేశించారు.  సోమవారం గోటాగోగామా, మైనాగోగామాలలో జరిగిన శాంతియుత నిరసనలపై జరిగిన దాడిపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వీరు దేశం దాటి పోకుండా ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు వారిపై విదేశీ ప్రయాణ నిషేధాన్ని విధించింది. 

మహింద రాజపక్స, ఆయన కుమారుడితోపాటు పార్లమెంటు సభ్యులు జాన్‌స్టన్ ఫెర్నాండో, పవిత్ర వన్నియారచ్చి, సంజీవ ఎడిరిమన్నే, కాంచన జయరత్నె, రోహిత అబేయుగుణవర్ధనె, సీబీ రత్నాయకే, సంపత్ అతుకోరల, రేణుక పెరేరా, శాంతి నిషాంత, సీనియర్ డీఐజీ దేశబంధు తెన్నాకూన్ తదితరులు నిషేధం ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. 
 
రెండు హింసాత్మక ఘటనల వెనక కుట్ర ఉందని, ముందస్తుగా దీనికి పథక రచన జరిగిందని పేర్కొన్న అటార్నీ జనరల్ వారిని విచారించాల్సిన అవసరం ఉందని, కాబట్టి దేశం విడిచి పోకుండా 17 మందిపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కోర్టును కోరారు.  ఆయన అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం వారు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించింది. 

ఇదిలా ఉంటే.. సోమవారం మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా జరిగింది. ఆయన మద్ధతుదారులు.. నిరసనకారుల మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగా(అనధికారికంగా ఇంకా ఎక్కువే!).. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ లంక రక్షణ శాఖ. 

మరోవైపు రాజీనామా హైడ్రామా నడిపిన మహింద రాజపక్స, ఆపై చెలరేగిన హింసతో నిజంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆపై కుటుంబం, అనుచర గణంతో నేవీ బేస్‌లో తలదాచుకున్నారాయన. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. రాజపక్స కుటుంబం, బంధువులు, అనుచరణ గణానికి చెందిన ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. 

కాగా,  మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచిపారిపోకుండా ఎక్కడికక్కడ చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తరుణంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించడం విశేషం.