శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే

కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం సాయంత్రం అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణోత్సవం జరిగింది.
గతంలో నాలుగు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన ఆయన పార్టీకి పార్లమెంట్ లో ఆయన ఒక్కరే సభ్యుడు కావడం గమనార్హం.ఆయన ఏనాడూ పూర్తి పదవీకాలం పని చేయలేదు. తక్షణమే ఆర్థిక పరిస్థితులను కట్టడి చేయాల్సిన బృహత్తర కర్తవ్యాన్ని ఆయన ఎదుర్కొనాల్సి వుంది. అది కూడా ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రాజీనామా చేయకుండా పదవిని అంటిపెట్టుకున్న అధ్యక్షుడు గొటబాయ నేతృత్వంలో పనిచేయాల్సి వుంది.
అయితే ఆర్ధిక వ్యవహారాలను సరిదిద్దడంతో అనుభవజ్ఞుడుగా, విదేశీ సహకారం పొందడంలో ప్రావీణ్యం గల నేతగా పేరుండడంతో ప్రస్తుత సంక్షోభం నుండి దేశాన్ని ఆయన గట్టెక్కించ గలరని పలువురు భావిస్తున్నారు. దానితో పలు పార్టీల మద్దతుతో ఆయన పార్లమెంట్ లో మెజారిటీ సాధింపగలరని భావిస్తున్నారు. 
ప్రస్తుతం లంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమస్యలు పోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వంటి అనుభవశాలి, వివాదరహితుడు మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు.. అక్కడి పౌరుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
అంతకు ముందు విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన వజిర అబేవర్ధనే అనే అధికారి వెల్లడించారు. మరోవైపు అనేకమంది పార్లమెంటు సభ్యులు కొత్త ప్రధానిగా విక్రమసింఘేనే రావాలని కోరుకుంటున్నారని అబేవర్ధనే వివరించారు.
యునైటెడ్ నేషనల్ పార్టీకి విక్రమసింఘేనే అధినేత. ఈయన ప్రధాని కావడంతో నిరసనలు కొంతైనా తగ్గుముఖం పట్టొచ్చని అధ్యక్షుడు గోటబయా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. విక్రమేసింఘేకు చెందిన పురాతన పార్టీ యూఎన్‌పీకి 225 సీట్లు ఉన్న పార్లమెంట్‌లో కనీసం ఒక్క స్థానం కూడా లేదు. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం విక్రమేసింఘే కూడా గెలవలేదు. 
 
అయితే క్యుములేటివ్ నేషనల్ ఓటు ప్రకారం యూఎన్‌పీకి కేటాయించిన ఒకే ఒక్క సీటు ద్వారా ఆయన పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. దీంతో మరోసారి ఆయన ప్రధానిమంత్రి పదవి చేపట్టే అవకాశం దక్కింది.
కాగా.. గొటబాయ రాజపక్సపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు గురువారం పార్లమెంట్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టాయి. ఈ నెల 17న సభలో అవిశ్వాసంపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్‌ మహీంద యాప అబేయ్‌వర్ధనే చెప్పారు. విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని భారత్‌ ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి తెరపడుతుందని భావిస్తున్న ట్లు శ్రీలంకలోని భారత హైకమిషన్‌ వెల్లడించింది.