లండన్‌లో భారత సంతతి యువకుడి దారుణ హత్య!

లండన్‌లో భారత సంతతి యువకుడి దారుణ హత్య!
లండన్ లో మరో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్‌లోని సౌత్‌హాల్ పరిధిలో ఉన్న సౌత్‌హాల్ ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన 26 సంవత్సరాల గుర్భేజ్ సింగ్‌ను దుండగులు కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. ఈ ఘోర ఉదంతాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు శనివారం అధికారికంగా ధృవీకరించారు. విదేశాల్లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురికావడంతో లండన్‌లోని ప్రవాస భారతీయ సమాజంలో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
బుధవారం అర్ధరాత్రి దాదాపు 12:30 గంటలకు నార్త్ రోడ్‌లోని డోర్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ వద్ద ఈ దాడి జరిగింది. కత్తిపోట్లపై సమాచారం అందుకున్న లండన్ అంబులెన్స్ సర్వీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేసరికి ఇద్దరు వ్యక్తులు గాయాలతో పడి ఉన్నారు.  తీవ్ర గాయాలపాలైన గుర్భేజ్ సింగ్‌ను రక్షించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాంతో అతడు మరణించినట్లు ప్రకటించారు.
ఈ ఘటనలో గాయపడిన 30 ఏళ్ల మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం అతడు డిశ్చార్జ్ అయ్యాడు.  ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఘటనా స్థలంలోనే 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు వ్యక్తులను అనుమానంపై అరెస్ట్ చేశారు. లోతైన విచారణ అనంతరం ఆరుగురిని ఎలాంటి తదుపరి చర్యలు లేకుండా విడుదల చేయగా, ఒక వ్యక్తికి బెయిల్ మంజూరు చేశారు. 
 
మెట్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ అలిసన్ ఫాక్స్‌వెల్ మాట్లాడుతూ. ‘గుర్భేజ్ సింగ్ హత్యపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. దాడి జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ఉన్నవారు లేదా ఘటనను చూసినవారు ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించాలి’ అని విజ్ఞప్తి చేశారు.

ఈ విషాద ఘటన నేపథ్యంలో గుర్భేజ్ సింగ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంత్యక్రియల ఖర్చుల కోసం అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ‘గోఫండ్‌మీ’ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. 16,000 యూరోల లక్ష్యంతో ప్రారంభించిన ఈ క్యాంపెయిన్‌లో ఇప్పటివరకు 737 మంది దాతల నుంచి 11,114 యూరోలు సమకూరాయి.