రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి చిప్ప చేతికిచ్చిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాల్జేసి ప్రజల చేతికి చిప్ప ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి తలపై రూ.లక్షకుపైగా అప్పు మోపారని, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ధ్వజమెత్తారు. 
 
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 29వ రోజు గురువారం రాత్రి పొద్దుపోయాక మహేశ్వరం నియోజకవర్గంలోని దావూద్ గూడ తండావద్ద గ్రామస్తులతో ముచ్చటిస్తూ విద్యుత్ ఛార్జీల పెంపుతో రూ.6 వేల కోట్ల భారాన్ని మోపిన కేసీఆర్ఆ దాయం కోసం ప్రతి ఇంటిపై రూ.500 నుండి వెయ్యి వరకు పన్ను వేసే రోజులు రాబోతున్నాయని హెచ్చరించారు.
రాష్ట్రంలో గిరిజన తండాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, పిల్లలను సాదలేక అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన తండాలను అభవ్రుద్ది చేయడంతోపాటు ప్రతి తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు.
 
పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తీసుకుంటున్నడని విమర్శించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టేందుకు కేసీఆర్ సిద్ధమైండని దుయ్యబట్టారు. 
  
తండాల్లో పిల్లలను సాదలేక పుట్టిన పిల్లలను అమ్ముకునే దుస్థితి. బాల్య వివాహాలు చేస్తున్నరని చెబుతూ కేసీఆర్ ఆదుకోకుండా గిరిజనుల గోస పుచ్చుతున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వని కేసీఆర్ ఊరికి 10 మద్యం దుకాణాలు తెరిచి ‘తాగు-ఊగు’ పథకం పెట్టి తాగిస్తున్నడని ఎద్దేవా చేశారు.
పొలంకాడ విద్యుత్ ఉచితంగా ఇస్తున్నానని చెప్పి… ఇంటి బిల్లుల మోత మోగించి ప్రజలపై భారం మోపిండని సంజయ్ ధ్వజమెత్తారు. డిస్కంలకు కేసీఆర్ రూ.60 వేల కోట్ల బకాయిలున్నడని, వాటిని చెల్లించకుండా ప్రజలపై మరింత భారం మోపుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులంతా ఏకమై గడపగడపకూ వెళ్లి కేసీఆర్ ను గద్దె దించేలా ప్రచారం చేయాలని సంజయ్ పిలుపిచ్చారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోవాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలకు డబల్ ఇంజిన్ ఫలితాలు అందుతున్నాయని చెబుతూ తెలంగాణాలో కూడా డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గోవాలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని,  దేశంలోనే 100 శాతం కరోనా వాక్సిన్ ఇచ్చిన మొదటి రాష్ట్రంగా గోవా నిలిచిందని పేర్కొన్నారు.  గోవా లో వితంతు పెన్షన్ ఇస్తున్నామని, కళ్యాణ లక్ష్మి పథకం గోవాలో కూడా ఉందని చెప్పారు.
 
వివాహ సమయంలో పేదింటి ఆడ పిల్లకు లక్ష రూపాయలు తాము ఇస్తున్నామని చెప్పారు. రైతులకు, పాడి రైతులకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని వివరించారు.