పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారం ప్రకటించిన పశ్చిమబంగా బంగ్లా అకాడమీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బెంగాలీ రచయిత, జానపద సాహిత్య పరిశోధకురాలు రత్నా రషీద్ బెనర్జీ తన అవార్డుని వెనక్కి ఇచ్చారు.
2019లో ‘అనందా శంకర్ శ్రమక్ సమ్మాన్’ పేరిట రత్నా రషీద్‌కు ఆ అకాడమీ అవార్డుని ప్రకటించింది. ఈ మేరకు ఆమె రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అకాడమీ చైర్మన్ భ్రత్యా బసుకి ఒక లేఖ రాశారు. మమతా బెనర్జీ రాసిన పుస్తకంలో సాహిత్యమే లేదని ఆమె స్పష్టం చేశారు.
సోమవారం రవీందన్రాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా 900 కవితలతో మమతా బెనర్జీ విడుదల చేసిన ‘కబితా బితాన్’ అనే పుస్తకానికి ఈ ఏడాదికి గాను సాహిత్య పురస్కారాన్ని ప్రకటించారు. సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును ముఖ్యమంత్రికి అందజేశారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే తన అవార్డుని వెనక్కి ఇవ్వాలని తాను భావించానని ఆ లేఖలో రత్నా రషీద్ తెలిపారు. మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుని ప్రదానం చేయడాన్ని తాను అవమానకరంగా భావిస్తున్నానని, ఈ పరిణామం విపరీత పరిస్థితులకు దారితీస్తుందని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సాహిత్య సాదనను ప్రశంసిస్తూ అకాడమీ చేసిన ప్రకటన సత్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా, రాజకీయ నేతగా మమతాని తాను అభినందిస్తామని, అయితే ఆమె సాహిత్యం కోసం కృషి చేశారన్న వాదనతో తాము ఏకీభవించలేమని ఆమె స్పష్టం చేశారు.
‘సీఎంకు సాహిత్య పురస్కారం ఇవ్వడం నన్ను అవమానించినట్లు భావిస్తున్నాను. ఆ నిర్ణయానికి ఇది నా నిరసన. నేను దానిని అంగీకరించలేను. ముఖ్యమంత్రి గారి ‘కబితా బితాన్’ పుస్తకాన్ని నేను సాహిత్యంగా అస్సలు పరిగణించను’ అని ఆమె తన లేఖలో తెలిపారు.
`ఆమె మన ముఖ్యమంత్రి. మనం ఆమెకు ఓటు వేశాం. నేను వృద్ధురాలిని. నాకు కలం భాష మాత్రమే తెలుసు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఆమె మనకు అందనంత ఉన్నత పదవిలో ఉన్నారని తెలుసు. ఇలాంటి ఉదంతాలు ప్రతికూల సంకేతాలు పంపే అవకాశముంది’ అంటూ రషీద్ బెనర్జీ తన అసంతృప్తిని తన లేఖలో వ్యక్తం చేశారు.
కాగా, మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికే తృణమూల్ నేతలు ఆమె అవార్డు ఇచ్చారని బీజేపీ సీనియర్ బిజెపి నాయకుడు శిశిర్ బజోరియా విమర్శించారు. రాజకీయ నాయకురాలైన మమతా బెనర్జీకి సాహిత్య అవార్డుతో కవులు, రచయితలు అసంతృప్తికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే రషీద్ బెనర్జీ తన సాహిత్య పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారని ఆయన తెలిపారు. తమ అధినాయకురాలి దృష్టిలో పడేందుకు తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోటీ నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
More Stories
రాహుల్ గాంధీపై గౌహతిలో కేసు
భారత మహిళల అండర్-19 జట్టు తొలి విజయం
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం