హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించిన నలుగురు ఉగ్రవాదులు!

హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించిన నలుగురు ఉగ్రవాదులు!
రాజధాని హైదరాబాద్‌లో దాడులు నిర్వహించేందుకు నలుగురు ఉగ్రవాదులు నాలుగు రోజులపాటు రెక్కీ నిర్వహించినట్టు  హరియాణా పోలీసుల విచారణలో బయట పడింది. నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఉగ్ర దాడులకు సంబంధించిన కీలకాంశాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర లోని నాందేడ్‌లో వీరు నాలుగు రోజులపాటు మకాం వేసినట్టు పోలీసులు చెప్పారు. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఉగ్రవాదులు నాందేడ్‌లో ఉన్నారని, అక్కడి నుంచి బీదర్‌ మీదుగా గోవాకు వెళ్లారని పోలీసులు కూపీ లాగారు. వీరంతా ఉగ్రవాదిగా మారిన గ్యాంగ్‌స్టర్‌ హర్వీందర్‌ సింగ్‌ రింధా అనుచరులని పోలీసులు చెబుతున్నారు.
హర్యానా, పంజాబ్ పోలీసులు గత వారం జరిపిన జాయింట్ ఆపరేషన్ లో  పాకిస్తాన్ నుండి డ్రోన్‌ల ద్వారా ఫిరోజ్‌పూర్ ఫీల్డ్‌లో పడిపోయిన పేలుడు పదార్థాలను పంపిణీ చేయడానికి తెలంగాణకు వెళుతున్న నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా పెద్ద ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. వారు ప్రయాణిస్తున్న వాహనం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
“వారు తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న రిండాతో టచ్‌లో ఉన్నారు.  పేలుడు పదార్థాలు, ఆయుధాలను అందించడానికి వారికి యాప్ ద్వారా లొకేషన్‌లను పంపేవారు. రిండా డ్రోన్‌ల సహాయంతో ఫిరోజ్‌పూర్‌లోని పొలాల్లో ముందుగా నిర్ణయించిన ప్రదేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పడవేసేవారు. వారు ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారో మేము నిర్ధారిస్తున్నాము, ”అని కర్నాల్ పోలీసు సూపరింటెండెంట్ గంగా రామ్ పునియా గత వారం  చెప్పారు.
పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను నాందేడ్‌కు తరలించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని చెప్పారు. వీరు హైదరాబాద్‌లో కూడా తిరిగారని జన సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ భయాందోళ న‌లు సృష్టించే విధంగా పథకం రూపొందించాలని కుట్ర పన్నినట్టు హరియాణా పోలీసులు చెప్పారు.
హైదరాబాద్‌లో ఏయే ప్రాంతాల్లో వీరు సంచరించారన్న అంశంపై నగర పోలీసులతో పాటు సీఐడీ, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐడీ, ఇంటలి జెన్స్‌ పోలీసులు దృష్టి సారించారు. హరియాణా పోలీసులతో మాట్లాడి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని హరియాణాకు పంపించి మరింత సమాచారాన్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
హరియాణా పోలీసులు సమన్వయం చేసుకుని పని చేయాలని తెలంగాణ పోలీసులు నిర్ణయించారు. ఉగ్రవాదులు నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు ఎలా వచ్చారు? రైలులో వచ్చారా? రోడ్డు మార్గాన చేరుకున్నారా?  నాలుగు రోజుల పాటు ఎక్కడ బస చేశారు?  హోటల్‌లోనా లేక ఇతర కార్యాలయాల్లోనా?  వారికి ఆశ్రయం కల్పించిందెవరు?
హైదరాబాద్‌లో ఎవరితోనైనా సంబంధాలు పెట్టుకున్నారా? నాలుగు రోజులు గడిపాక ఎక్కడికి వెళ్లారు? అనే కోణంలో తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. హర్విందర్‌ సింగ్‌ రింధా అనుచరులు ఉగ్రవాదులని హరియాణా పోలీసులు తేల్చిచెప్పడంతో హర్విందర్‌ సింగ్‌ పూర్వ చరిత్రపై పోలీసులు దృష్టి సారించారు.
మొత్తం మీద ఉగ్రవాదులు హైదరాబాద్‌లో సంచరించారని, రెక్కి నిర్వహించారని తేలడంతో పోలీసులు కఠిన చర్యలకు సమాయత్త మవుతున్నట్టు తెలుస్తోంది.