ప్రభుత్వం రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ల మధ్య లోక్‌సభలో మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ముస్లిం మహిళలకు రిజర్వేషన్‌లోనే మరో రిజర్వేషన్ కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేయగా, రాజ్యాంగం మత ఆధారిత రిజర్వేషన్లను అనుమతించదని పేర్కొంటూ హోం మంత్రి ఆ డిమాండ్లను గట్టిగా తిరస్కరించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం ఎందుకు తొందరపడుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ లోక్‌సభలో ప్రశ్నించారు. ముందుగా జనగణన ప్రారంభించాలని చెబుతూమహిళా రిజర్వేషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇస్తుందని, కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మహిళా కోటాను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేశ్ తెలిపారు. ఒకవేళ జనగణన జరిగిన తర్వాత మేం కుల గణన గురించి అడుగుతామని, అప్పుడు రిజర్వేషన్ సమస్య వస్తుందని, అందుకే మమ్ముల్ని మీరు మోసం చేస్తున్నారని అఖిలేశ్ ఆరోపించారు.
ఎన్డీఏ హయాంలో మహిళలకు అనేక పథకాలు తెచ్చినట్లు చెప్పారని, కానీ లింగ సమానత్వంలో భారత్ ఎక్కడ ఉందో గమనించాలని కోరారు. దేశంలో 21 రాష్ట్రాలు, యూటీల్లో ఎన్డీఏ పాలన ఉందని, అందులో మహిళ సీఎంలు ఎంతమంది ఉన్నారుని ప్రశ్నించారు. ఢిల్లీలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి కేవలం సగం సీఎం మాత్రమేనని, అధికారాలు మాత్రం లేవుని ధ్వజమెత్తారు.
అయితే అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలకు అమిత్ షా కొట్టిపారవేస్తూ దేశంలో జనగణన ప్రక్రియ మొదలైందని తెలిపారు. కుల గణన కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, 2027 జనాభా లెక్కల్లో కుల గణన కూడా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. జనాభా లెక్కల సమయంలో కుల గణన కూడా జరుగుతందని సభకు హామీ ఇస్తున్నానని మంత్రి తెలిపారు.
మతం ఆధారంగా కేవలం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం అప్రజాస్వామికమే అవుతుందని మంత్రి షా ధ్వజమెత్తారు. అంటే ముస్లింలు 50 శాతం కేటగిరీలోకి రారా? అని అఖిలేశ్ అడిగారు. దానికి కౌంటర్ ఇస్తూ సమాజ్‌వాదీ పార్టీ తమ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకే ఇవ్వాలని, దీన్ని తాము వ్యతిరేకించమని అమిత్ షా చెప్పారు. అయితే చర్చించాల్సిన తీరు ఇది కాదు అని, ఆ ఇద్దరి మధ్య చర్చను స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు.
మహిళా రిజర్వేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చూస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ఆరోపించారు. ఒకవేళ మహిళా కోటా చట్టాన్ని అమలు చేయాలనుకుంటే, తాజా లోక్‌సభ సీట్ల సంఖ్య ఆధారంగా తక్షణమే రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు ఆ బిల్లులు వ్యతిరేకింగా ఉన్నాయని తెలిపారు.
కులగణనకు, రాజ్యాంగానికి, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఆ బిల్లులు ఉన్నట్లు ఆయన చెప్పారు. మహిళా రిజర్వేషన్ పేరుతో డీలిమిటేషన్‌ను కేంద్రం బుల్డోజ్ చేస్తున్నదని ఆయన విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌కు తాము మద్దతు ఇస్తామని, కానీ దాన్ని సరళీకరించాలని, డీలిమిటేషన్‌తో లింకు చేయవద్దు అని, 543 సీట్ల ఆధారంగానే లోక్‌సభలో రిజర్వేషన్ చేపట్టాలని గగోయ్ కోరారు.
జాప్యం చేసేందుకే రెండు బిల్లులను కలిపినట్లు ఆయన ఆరోపించారు. ఒకవేళ తాము చెప్పినట్లు 2023లోనే విని ఉంటే, అప్పుడు 2024లో మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేదని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు మరింత శక్తి లభించబోతోందన్నారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర మరింత కీలకం కాబోతోందని చెప్పారు.
More Stories
రిజర్వేషన్లను అడ్డుకునే వారిని మహిళలు క్షమించరు
815 లోక్‌సభ సీట్లలో.. 272 సీట్లు మహిళలకే
సంస్కరణల పేరిట మతాన్ని నిర్వీర్యం చేయలేం