శ్రీలంక ప్రధాని మహిందా  రాజపక్స రాజీనామా 

ప్రజాందోళనలు తీవ్రం కావడం, విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో శ్రీలంక ప్రధాని మహిందా  రాజపక్స (76)ఎట్టకేలకు రాజీనామా చేశారు.  రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
 
రాజీనామా అనంతరం రాజపక్స పేరిట ప్రకటన వెలువడింది. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఆర్ధిక సంక్షోభానికి  త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజపక్స ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
 శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంలో గతవారం జరిగిన ప్రత్యేక కేబినెట్‌ సమావేశంలో.. మహిందా రాజీనామా చేసేందుకు ముందుకు వచ్చారని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రధాని రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దు కానుంది. 
 
మరోవైపు కొలంబోలో అధ్యక్ష భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాజీనామా కోసం ఆయన పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున (ఎస్‌ఎల్‌పిపి) కార్యకర్తలే డిమాండ్ చేస్తుండడంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. 
 
సోమవారం ఉదయం  రాజపక్స కుటుంబం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న నిరసనకారులపై  ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఘర్షణల్లో సుమారు 20 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
కొంతమంది పౌరులు రాజపక్సే రాజీనామాను డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి అధ్యక్ష భవనం వద్ద నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా వారిపై రాజపక్సే మద్దతుదారులు కర‍్రలతో దాడి చేయడం కలకలం సృష్టించింది. దీంతో  దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.  ప్రజలు సంయమనం పాటించాలంటూ మహీందా ట్వీట్‌ చేశారు.
ఈ ట్వీట్‌పై మాజీ శ్రీలంక క్రికెటర్‌ కుమార్‌ సంగక్కరా స్పందిస్తూ మీ మద్దతుదారులే ఈ హింసకు కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శాంతియుతంగా నిరసన చేపడుతున్న ఆందోళనకారులపై మీ గూండాలు, దొంగలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. అనంతరం రాజీనామా ప్రకటన వెలువడటం గమనార్హం. కొలంబోలో భారీగా బలగాలను మోహరించారు. క ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రో ధరలతో దేశ ప్రజలు నిరసనలకు దిగారు.
 
రాజపక్స కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజకీయాలు వదులుకోవాలని, దోచుకున్న దేశ సంపదను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బౌద్ధ మత గురువులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ శ్రీలంకలో అనిశ్చితి నెలకొని ఉంది. దేశం ఇప్పటికీ ‘ఎమర్జెన్సీ’లో ఉంది.
 
అయితే తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కరోనా మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం చెబుతూ వస్తోంది.శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. ఇంధనం, ఔషధాలు, విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది.