గోరంట్లలో బీ ఫార్మసీ విద్యార్థిని మృతిపై దుమారం

సత్యసాయి జిల్లా  గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన బిఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతిపై శవపరీక్ష కూడా జరపకుండానే ఆమె ఆత్మహత్య చేసుకుందని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం పోలీసులు చేయడంతో స్థానిక ప్రజలలో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. 
 
ప్రేమపేరుతో మోసం చేసి, తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి, ఆపైన హత్య చేసిన దుండగులను ఉరి తీయాలంటూ స్థానిక యువత ఆందోళనలు చేపట్టడంతో జిల్లా పోలీసులు దిశా పోలీస్ స్టేషన్‌కుకేసును అప్పగించారు.
ఓ ముస్లిం యువకుడు విద్యార్థినిపై అత్యాచారం జరిపి అనంతరం హత్య చేశారంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. తేజశ్విని ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్నటి వరకు ఆత్మహత్యగా చెప్పిన పోలీసులు.. నేడు రేప్ కేసుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థిని మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ దిశా డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ రాహుల్ ఆదేశించారు.
తేజస్విని మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ వెల్లడించారు. తమ కుమార్తె తేజస్వినిని ప్రేమించిన వ్యక్తే నమ్మించి హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉండటంతో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. తన ప్రియుడికి చెందిన షెడ్‌లో తేజస్విని అనుమానాస్పదంగా మృతి చెందింది.
 
తేజస్విని, సాదిక్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారని చెప్పారు. ఈ నెల 4న యువతికి సాదిక్‌ ఫోన్‌ చేసి ఇంటికి రమ్మన్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఆమెను పొలంలోని రేకుల షెడ్‌కు తీసుకెళ్లాడని.. రెండు గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారని చెప్పారు. 
 
రాత్రి కావడంతో భోజనం తెస్తానని షెడ్‌లోనే సాదిక్‌ ఆమెను వదిలి వెళ్లాడన్నారు. అయితే, ఇంటి నుంచి మళ్లీ పొలంలోని షెడ్‌కు సాదిక్‌ వెళ్లేసరికి యువతి ఉరేసుకుని కనిపించిందని వివరించారు. ఈ విషయాన్ని సాదిక్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెప్పాడని పేర్కొన్నారు.

ఈ క్రమంలో మొదటిసారి నిర్వహించిన పోస్టుమార్టంలో యువతి ఉరి వేసుకున్నట్లు వచ్చిందని డీఎస్పీ రమాకాంత్ చెప్పారు. అయితే, మృతురాలి తల్లిదండ్రులు మాత్రం సామూహిక అత్యాచారం, హత్యగా అనుమానించారని తెలిపారు. అందుకే రీ పోస్ట్‌మార్టంకు ఆదేశించినట్లు వెల్లడించారు. 

 
మృతురాలి ముఖంపై గాయాల ఫొటోను మీడియా ప్రతినిధులు మీడియాకు చూపించగా.. ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. డీఎస్పీ వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
 
మరోవైపు రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్న పెనుకొండ ఆస్పత్రి వద్ద తెలుగు దేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ రాహుల్‌దేవ్‌ సింగ్‌ వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎస్పీ వాహనం ఎదుట టీడీపీ నాయకులతో పాటు వాల్మీకీ సంఘం నేతలు బైఠాయించారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 బీఫార్మసీ విద్యార్ధిని తేజస్విని మరణం మిస్టరీగా మారిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. సోమవారం డీజీపీని కలిసిన బీజేపీ నేతలు బీ ఫార్మసీ విద్యార్ధిని తేజస్విని కేసులో న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటనలను బట్టి ఇది ఆత్మహత్య కాదని, హత్మగా భావించాల్సి వస్తోందని స్పష్టం చేశారు. 
 
ఈ కేసులో నేరస్తులు తప్పించుకోడానికే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందని హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని తెలిపారు. ప్రత్యేక అధికారితో సిట్ బృందం ఏర్పాటుచేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. 
 
ఘటన జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.ఏపీలో నిజాయితీగా పని‌చేసే అధికారులకు పని చేసే స్వేచ్చ ఇవ్వాలని చెబుతూ  రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనేది వాస్తవమని స్పష్టం చేశారు.
 
బీఫార్మసీ విద్యార్థిని తేజశ్వని అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్‌ని తప్పించే ఎత్తుగడే అని ఆరోపించారు. తమ కూతురుపై అత్యాచారం చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తే.. పోస్ట్‌మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ తేల్చేశారని విస్మయం వ్యక్తం చేశారు.