దివ్యాంగ చిన్నారిని ఇండిగో నిరాకరించడంపై దుమారం

దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి రానివ్వకపోయిన సంఘటనపై దుమారం చెలరేగింది.  రాంచీవిమానాశ్రయంలో చిన్నారి బాగా భయపడుతుండటంతో అతని ప్రయాణానికి నిరాకరించినట్టు విమానయాన సంస్థ తెలిపింది. 
 
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండిగోపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు.
 
 చిన్నారి భయాందోళనతో ఉన్నాడని, దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదని తెలిపారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 
 
చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని,  ఇది చాలా అమానవీయ ఘటన అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పలువురు నెటిజన్లు ఇండిగోపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ స్పందించింది. 
 
భయంతో ఉన్న ఆ చిన్నారి స్తిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం దాకా గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారని, కానీ ఫలితం లేక పోయిందని ఇండిగో వివరణ ఇచ్చింది. అనంతరం ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్టు పేర్కొంది. 

ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్య స్థానానికి చేరినట్టు తెలిపింది. ఉద్యోగులైనా, ప్రయాణికులైనా, అందరినీ కలుపుకుని వెళ్లే సంస్థ ఇండిగో. ప్రతినెలా తమ విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారని సంస్థ పేర్కొంది.

ఈ ఘటనపై స్వయంగా తాను దర్యాప్తు చేస్తానని , బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇండిగోను హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని, ఏ వ్యక్తికీ ఇలాంటి అనుభవం జరగకూడదని స్పష్టం చేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ ) దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉండగా ఇండిగో సంస్థపై బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సిపిసిఆర్) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.  ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆ సంస్థ పైన, మేనేజర్‌పైన తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)ను ఎన్‌సిపిసిఆర్ ఛైర్‌పర్శన్ ప్రియాంక్ కనూంగ్ కోరారు. 
 
ఈ సంఘటనపై తమకు ఫిర్యాదు అందిందని వారిపై చర్య కోరుతున్నట్టు డిజిసిఎకు, జార్ఖండ్ ఎస్‌ఎస్‌పికి వేర్వేరు ఉత్తరాల్లో కోరారు. తీసుకున్న చర్యపై నివేదిక కమిషన్‌కు సమర్పించాలని కనూంగూ జార్ఖండ్ ఎస్‌ఎస్‌పి సురేంద్ర కుమార్ ఝా కు సూచించారు.

దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది  నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్‌ వీల్‌ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు.ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు.