దేశ ద్రోహ చట్టం సమీక్షకు కేంద్రం అంగీకారం

దేశ ద్రోహ చట్టాన్ని పున:పరిశీలించేందుకు, పున:సమీక్షించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలియజేసింది. ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వలసపాలకుల కాలం నాటి చట్టాల కొనసాగించరాదన్న ప్రధాని నరేంద్ర మోదీ అభిమతానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశ ద్రోహ చట్టంపై దేశంలో వివిధ వర్గాల ప్రజలు, పౌర హక్కుల సంఘాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుందనీ, దేశ సర్వసత్తాక ప్రతిపత్తి, దేశ సమగ్రతలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణమైన చట్టాలను మాత్రమే అమలుజేయాలనీ, భారత శిక్షాస్మృతిలోని 124-ఏ సెక్షన్‌ కింద దేశద్రోహాన్నిమోపే సెశ్రన్‌ను తొలగించాలని నిర్ణయించింది.

కేంద్రం ఈ చట్టాన్ని పున:పరిశీలించేవరకూ, సమీక్షించేవరకూ ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై ఎటువంటి తీర్పు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. ఈ చట్టాన్ని కొనసాగింపుపై 1962 నాటి సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించాలని ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది.

అయితే, ప్రధానమంత్రి అభిమతానికి అనుగుణంగా  నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు పూర్తిగా సహకరిస్తామని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ తెలియజేశారు. ఇప్పుడు ఈ చట్టం సమీక్షకు నిర్ణయం తీసుకున్నందున దీనిని ఓ సాధికారిక ఫోరం ఆధ్వర్యంలో పూర్తి చేసేందుకు సిద్ధపడిన దశలో సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలపై కూలంకుషంగా నిర్ణయం తీసుకోవల్సి ఉందని కేంద్రం తెలిపింది. 

చట్టం రద్దుకు ఎడిటర్స్ గిల్డ్, టిఎంసి ఎంపి మహూవా మొయిత్రా ఇతరులు దాఖలు చేసుకుని ఉన్న పిటిషన్ల గురించి సమయం వృధా చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని సంబంధిత ధర్మాసనం దృష్టిలో పెట్టుకోవాలని కేంద్రం కోరింది. 

కాగా రాజద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మే 10 నుంచి వింటామని గతంలో సుప్రీంకోర్ట్ ప్రకటించింది. అందుకు, ఓ రోజు ముందు కేంద్రం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. మూడు పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో పేర్కొంది. 

దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మూలనపడేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ ముందు ఈ అఫిడవిట్‌ను సమర్పించింది.