తెలంగాణాలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకు వస్తాం 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును తీసుకువస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా భరోసా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా గురువారం సాయంత్రం మహబూబ్ నగర్ లో నిర్వహించిన జనం గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. 

దుబ్బాక, హుజూరాబాద్లో తగిలిన ఎదురుదెబ్బలు టీఆర్ఎస్కు గుణపాఠాలని చెబుతూ  టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ సమితి అని ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత అవినీతి సర్కారు కేసీఆర్ దేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. మిషన్ భగీరథలో కూడా భారీ అవినీతి జరిగిందని నడ్డా విమర్శించారు. 

 ‘‘తెలంగాణలో ఏ ప్రాజెక్టును పరిశీలించినా అవినీతిమయంగానే ఉంది. సాగునీటి పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. కేసీఆర్‌ కుటుంబానికి.. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారింది. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయాన్ని రూ.1.20 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారు. కేసీఆర్‌ పాలనలో కొత్తగా అంగుళం భూమికి కూడా సాగునీరు అందలేదు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’’ అని నడ్డా ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే రాష్ట్ర అభివృద్ధి రెట్టింపు అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి వాటినే తెలంగాణలో అమలు చేస్తున్నారని నడ్డా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్ అమలు కాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నాడని ధ్వజమెత్తారుబీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకాన్నిఅమలుచేస్తామని నడ్డా హామీ ఇచ్చారు.

దేశాన్ని పేదరికం నుంచి దూరం చేసేందుకు మోదీ సర్కారు కృషి చేస్తోందని నచెబుతూ 100కుపైగా దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత మోదీదేనని ఆయన కొనియాడారు.  కరోనా సమయంలో అమెరికా, జెర్మనీ, ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయాయని… అదే సమయంలో ప్రజల సహకారంతో కరోనాను ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. 

రూ.130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే అని చెబుతూ 190 కోట్ల వ్యాక్సిన్లు అందించి దేశ ప్రజల ప్రాణాలకు ప్రధాని కవచంగా నిలిచారని చెప్పారు.  కరోనా నియమ నిబంధనలు పాటించని కేసీఆర్… అదే సమయంలో కరోనా నిబంధనల పేరుతో బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్లో ఉన్నది తెలంగాణ ద్రోహులని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మజ్లిస్తో దోస్తీ చేస్తున్న కేసీఆర్.. మోదీ  సర్కారుపై విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్న కిషన్ రెడ్డి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ను తెలంగాణ ప్రజా భవన్గా మారుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మ బలిదానాలన్నీ కేసీఆర్ కుటుంబం కోసం చేసినట్లుగా మారిందని ఎద్దేవా చేశారు.  

తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులన్న ఆయన.. రాష్ట్రంలో ఇకపై తండ్రీ కొడుకుల ఆటలు సాగవని హెచ్చరించారు. కమలం పార్టీ పాలమూరుకు ఎంతో రుణపడి ఉందన్న కిషన్ రెడ్డి..వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.