కరోనా మహమ్మారి తర్వాత సిఎఎ అమలు తథ్యం

కరోనా పరిస్థితి ముగిసిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలు జరిగి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. ఈ విషయమై  తృణమూల్ కాంగ్రెస్ ప్రజలలో పుకార్లు వ్యాప్తి చేస్తోందని ఆయన  రెండు రోజులపాటు ఆ రాష్ట్ర పర్యటన సందర్భంలో ఆరోపించారు.

ఉత్తర బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో షా మాట్లాడుతూ, “సీఏఏను అమలు చేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పుకార్లు వ్యాప్తి చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రమాదం తొలగిన   తర్వాత, ఈ చట్టాన్ని అమలు చేస్తాము. మన  శరణార్థ సోదరులు, సోదరీమణులకు పౌరసత్వ హక్కులను కల్పిస్తామని ఈ రోజు నేను మీకు హామీ ఇస్తున్నాను” అని ప్రకటించారు. 


ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రస్తావిస్తూ, “మమతా దీదీ [బెంగాల్‌లోకి] చొరబాటు దారులకు అవకాశం కల్పిస్తూ, మన శరణార్థ సోదరులు పౌరసత్వం పొందకుండా చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు. అయితే సిఎఎ  అనేది వాస్తవమని, అది వాస్తవమని, అది అమలు జరిగి తీరుతుందని గుర్తించాలి. తృణమూల్ కాంగ్రెస్ దీనిని మార్చలేదు” అని స్పష్టం చేశారు.

2019లో అమల్లోకి వచ్చిన  సిఎఎ  ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో హింసను ఎదుర్కొని భారతదేశానికి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ , క్రిస్టియన్ వర్గాల వారికి పౌరసత్వం మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పశ్చిమ బెంగాల్‌ రెండు రోజుల పర్యటనలో రాష్ట్రంలో రాజకీయ హత్యలు, ఎన్నికల అనంతర హింస, అవినీతిని అరికట్టడంలో విఫలమైందని మమతా బెనర్జీ ప్రభుత్వంపై అమిత్ షా మండిపడ్డారు. యాదృచ్ఛికంగా, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.

“బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీకి మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ఆదేశాన్ని ఇచ్చారు. మమతా బెనర్జీ తన విధానాలను చక్కదిద్దుతారని, ఆమె పనితీరును మార్చుకోవాలని మేము ఆశించాము. ఆమె తనను తాను సరిదిద్దుకోవడానికి మేము ఒక సంవత్సరం పాటు వేచి ఉన్నాము. కానీ ఆమె మారలేదు, ”అని షా ధ్వజమెత్తారు.

 
 “దౌర్జన్యాలు ఆగిపోయాయా? హత్యల సంఖ్య [తగ్గిందా]? హింస ఆగిపోయిందా? అవినీతి అంతమైందా? బీజేపీ పోరాడదని అనుకోవద్దు. బిజెపి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను” అని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాకాండ జరిగిన తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
“ఇక్కడ 101 మంది మరణించారు, 1,829 మంది గాయపడ్డారు.  168 కంటే ఎక్కువ కేసులలో టిఎంసి గూండాలు దోషులుగా నిర్ధారించబడ్డారు,” అని కమీషన్ నివేదిక స్పష్టం చేస్తున్నట్లు అమిత్ షా గుర్తు చేశారు.  రాష్ట్రంలో తాజా హింసాత్మక సంఘటనలను ప్రస్తావిస్తూ, ఎనిమిది మంది మహిళలు, ఒక చిన్నారిని సజీవ దహనం చేసిన బీర్భూమ్‌కు ముఖ్యమంత్రి ప్రతినిధి బృందాన్ని ఎందుకు పంపలేదని షా ప్రశ్నించారు.
 
 “దేశమంతటా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆమె ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతుంది, అయితే ఎనిమిది మంది మహిళలు,  ఒక బిడ్డను సజీవ దహనం చేసిన బీర్భూమ్‌కు ఆమె ఎందుకు ప్రతినిధి బృందాన్ని పంపలేదు? వారు ఆమె వ్యక్తులు కాదా? మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన నదియా జిల్లాకు నిజనిర్ధారణ బృందాన్ని ఎందుకు పంపలేదు?” అని నిలదీశారు.

ఉత్తర బెంగాల్ కొండల్లోని గూర్ఖా సమాజాన్ని ముఖ్యమంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. “గూర్ఖా సోదరులు,  సోదరీమణులకు వారి ప్రయోజనాల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి అని చెప్పడానికి నేను ఈ రోజు వచ్చాను. రాజ్యాంగ పరిధిలో అన్ని సమస్యలకు శాశ్వత రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటామని హామీ ఇస్తున్నాను” అని తెలిపారు.

2021 ఎన్నికల్లో అసెంబ్లీలో బీజేపీ సంఖ్యను 77కి పెంచడంలో సహకరించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలకు షా కృతజ్ఞతలు తెలిపారు. “గత అసెంబ్లీ ఎన్నికల్లో [2016] పోటీ చేసినప్పుడు మాకు 3 సీట్లు మాత్రమే వచ్చాయి. మా సంఖ్యను 77 సీట్లకు పెంచుకోవడానికి మీరు మాకు సహాయం చేసారు” అని కృతజ్ఞతలు తెలిపారు. 

 
అసెంబ్లీ ఎన్నికల్లో[2021] బీజేపీకి 2.28 కోట్ల ఓట్లు వేసి ప్రతి గ్రామంలోనూ పార్టీని బలోపేతం చేశారని కేంద్ర మంత్రి తెలిపారు. బెంగాల్ ప్రజలపై దీదీ తన దౌర్జన్యాలను, అవినీతిని ఆపే వరకు బీజేపీ తన పోరాటాన్ని ఆపదని అమిత్ షా భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో దేశంలోనే అత్యధిక విద్యుత్‌ ధరలు ఉన్నాయని, పెట్రోల్‌ ధర అత్యధికంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
 
 “నేటికీ, బెంగాల్‌లోని పేదలకు ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనం లేదు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణకు భయపడి మమతా దీదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదు” అని విమర్శించారు.