రాజకీయ భవిష్యత్ పై ప్రశాంత్ కిషోర్ తప్పటడుగులు

రాజకీయ వ్యూహకర్తగా ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్ ను తీర్చిదిద్ది తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ పై తప్పటడుగులు వేస్తున్నారు. వ్యూహకర్త ప్రస్థానంకు స్వస్తి పలికి రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరించాలని సంవత్సరంకు పైగా  ఒకొక్క దిక్కు తిరుగుతూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 
 
మొదట బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఓ వేదికపైకి చేర్చి తానే సారధ్యం వహించాలని ప్రయత్నం చేశారు. అది కుదరదని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి చక్రం తిప్పాలని తీవ్రంగా మంతనాలు జరిపారు. అక్కడా తన ఆటలు సాగవని గ్రహించి, తానే ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలి అనుకున్నారు. 
 
రాజకీయ పార్టీ ఏర్పాటు అంటే సలహాలు ఇచ్చినంత సులభం కాదని గ్రహించినట్లున్నారు. నాలుగు రోజులకే ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తాజాగా, బీహార్ కె పరిమితమై పాదయాత్రతో తన ప్రహసం ప్రారంభిస్తానని ప్రకటించారు. 
 
సొంత రాష్ట్రం బిహార్‌లో మార్పు కోసం భావసారూప్యత గల వ్యక్తులతో ‘జనసురాజ్‌’ అనే వేదికను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. చివరి దశలో అదే రాజకీయ పార్టీగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు. తన ‘విజన్‌’ను సుమారు 18 వేల మందితో పంచుకున్నానని, వారందరితో టచ్‌లో ఉన్నానని, వ్యక్తిగతంగా వారిని కలిసేందుకూ ప్రయత్నిస్తానని చెప్పారు.
 
 ఆ తర్వాత గాంధీ జయంతి (అక్టోబర్‌ 2) నాడు చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. సుమారు ఏడాది పాటు సాగే ఆ పాదయాత్రలో బిహార్‌లోని ప్రతి ప్రాంతాన్నీ సందర్శించి, ప్రజల కష్టాలు, ఆకాంక్షలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. 
 
కాగా, రాహుల్‌ గాంధీ ముందు తాను చాలా చిన్న వ్యక్తినని ఓ ఆంగ్ల టీవీచానల్‌తో ఆయన పేర్కొన్నారు. ‘‘రాహుల్‌గాంధీ చాలా పెద్ద వ్యక్తి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. కాంగ్రె్‌సకు పీకే అవసరం లేదు. పీకే కంటే ఎక్కువ అనుభవం, సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు’’ అంటూ ఆ పార్టీలో చేరేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం పట్ల తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.