బిజెపి నేత అరెస్ట్… పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు

భారతీయ జనతా పార్టీ  నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలో అరెస్టు చేసి, పంజాబ్ తీసుకెళ్తున్న ఆ రాష్ట్ర పోలీసులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బగ్గాను పంజాబ్ పోలీసులు కిడ్నాప్ చేసినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన యువమోర్చా జాతీయ కార్యదర్శి. 
 
ఆయనను అరెస్టు చేయడంలో సరైన నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. ఆయనను తిరిగి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ట్విటర్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలలో మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బగ్గాను అరెస్టు చేస్తున్నట్లు జనక్‌పురి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చి, శుక్రవారం ఉదయం పశ్చిమ ఢిల్లీలోని జనక్‌పురిలో ఉన్న ఆయన నివాసం నుంచి ఆయనను అరెస్టు చేశామని పంజాబ్ పోలీసులు తెలిపారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఐదు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన హాజరు కాకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని పేర్కొన్నారు.
అయితే,  బగ్గా తల్లి కమల్ జీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ, పంజాబ్ పోలీసులు తన కుమారుడిని మతాచారం ప్రకారం ధరించే తలపాగాను ధరించనివ్వలేదని పేర్కొన్నారు. పైగా, పోలీసుల చర్యలను వీడియో తీస్తున్న తన భర్తపై దాడి చేశారని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాగిరి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
పంజాబ్ పోలీసులు తెల్లవారుజామున తమ  ఇంటికి వచ్చి,  నిద్రపోతున్న బగ్గాను అదుపులోకి తీసుకొన్నారని, కనీసం తలపాగాను కూడా ధరింపనీయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సిక్ ను తలపాగా ధరింపకుండా అడ్డుకోవడం పెద్ద నేరం అని ఆమె స్పష్టం చేశారు.
ఎస్ఎఎస్ నగర్ మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,  పంజాబ్ పోలీసు బృందం నుండి నిందితుడు తాజిందర్ పాల్ సింగ్ బగ్గాను విడుదల చేయాలని అభ్యర్థిస్తూ కురుక్షేత్రలోని ఎస్ ఎస్ పి కి   లేఖ పంపడంతో హర్యానా పోలీసులు వాహనశ్రేణిలో వెడుతున్న పంజాబ్ పోలీసులను కురుక్షేత్ర వద్ద ఆపివేశారు. “తగు సమయంలో చట్ట ప్రకారం కోర్టు ముందు ప్రవేశ పెడతాము” అని అందులో స్పష్టం చేశారు.
ఈ విధంగా అక్రమ నిర్బంధంపై పాల్పడటం నేర న్యాయవ్యవస్థ నిర్వహణలో జోక్యం చేసుకోవడంతో సమానం అని ఢిల్లీ పొలిసు అధికారి స్పష్టం చేశారు.  పంజాబ్ పోలీసు బృందం సరైన విధానాన్ని అనుసరించలేదని ఢిల్లీ పోలీసులు ఆరోపించడంతో బగ్గాను హర్యానాలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 “మేము బగ్గాను, పంజాబ్ పోలీసు బృందాన్ని థానేసర్ పోలీస్ స్టేషన్, కురుక్షేత్రకు తీసుకువచ్చాము. మేము పంజాబ్ పోలీసులను ప్రశ్నించాము. ఢిల్లీ పోలీసుల బృందం పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, పంజాబ్ ఏడీజీపీ శరద్ సత్య చౌహాన్ కూడా కురుక్షేత్రకు వచ్చే అవకాశం ఉంది” అని హర్యానా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ఇచ్చిన ట్వీట్‌లో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దుష్టశక్తులతో చేతులు కలిపారని ఆరోపించారు. తజిందర్ బగ్గా తల్లితో తాను మాట్లాడానని, ఈ అణచివేత సమయంలో తమ వ్యవస్థ మొత్తం ఆ కుటుంబానికి మద్దతుగా నిలుస్తుందని చెప్పానని తెలిపారు.
బగ్గాను సురక్షితంగా తీసుకురావడం కోసం బీజేవైఎం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని  ఆయన స్పష్టం చేశారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బగ్గా బెదిరించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు పంజాబ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్ట్ కు దిగారు.  కాగా, తన రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకే సీఎం కేజ్రీవాల్‌ అరెస్టులు చేయిస్తున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి కపిల్‌ మిశ్రా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.