సుద్దులు చెప్పవద్దని నెదర్లాండ్స్ రాయబారికి భారత్ హితవు

సుద్దులు చెప్పవద్దని నెదర్లాండ్స్ రాయబారికి భారత్ హితవు
బ్రిటన్‌కు నెదర్లాండ్స్ రాయబారి, ఐక్యరాజ్య సమితిలో భారత దేశ శాశ్వత ప్రతినిధిల మధ్య ట్విటర్ వార్ జరిగింది. యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత దేశానికి ఉచిత సలహా ఇచ్చినందుకు భారత దౌత్యవేత్త దీటుగా సమాధానం చెప్పారు. తమకు సుద్దులు చెప్పవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు.ఆధిక్యభావంతో స్నేహాన్ని ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. 
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అంతకు ముందు తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్, లుహాన్‌స్క్‌లను స్వతంత్ర రాజ్యాలుగా రష్యా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభ, మానవ హక్కుల మండలిలలో ప్రవేశపెడుతున్న తీర్మానాలపై ఓటింగ్ నుంచి భారత దేశం గైర్హాజరవుతోంది.
ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సమీపంలోని పట్టణాల నుంచి వెనుదిరిగిన సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సాధారణ ప్రజలను హత్య చేసినట్లు అమెరికా ఆరోపించింది. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేయాలని కోరుతూ ఓ తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనిపై ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో జరిగిన ఓటింగ్‌కు భారత దేశం గైర్హాజరైంది.
అదేవిధంగా మార్చిలో కూడా సాధారణ సభలో జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. ఉక్రెయిన్‌లో ఏర్పడిన మానవతావాద సంక్షోభంపై ఈ తీర్మానాన్ని ఉక్రెయిన్, దాని మిత్ర దేశాలు ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానం తమ విధానాన్ని ప్రతిబింబించడం లేదని, రష్యా, ఉక్రెయిన్ మధ్య శత్రుత్వ భావాలు అంతం కావాలని తాము కోరుకుంటున్నామని భారత్ తెలిపింది.
 మార్చి 2న సాధారణ సభ ఆమోదించిన తీర్మానంలో ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రత, స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారాలను గట్టిగా సమర్థించింది.  ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత ప్రతినిధి టి ఎస్ తిరుమూర్తి  బుధవారం ఐరాస భద్రతా మండలి సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ సమస్యపై ప్రసంగించారు.
దీనికి సంబంధించిన పూర్తి పాఠాన్ని ట్వీట్ చేశారు.
దీనిపై బ్రిటన్‌కు నెదర్లాండ్స్ రాయబారి కరేల్ వాన్ ఊస్టరోమ్ స్పందిస్తూ, ‘‘మీరు (భారత దేశం) ఐక్య రాజ్య సమితి సాధారణ సభలో (ఓటింగ్‌కు) గైర్హాజరై ఉండవలసింది కాదు. ఐరాస చార్టర్‌ను గౌరవించండి’’ అని హితవు పలికారు.  దీనిపై టీఎస్ తిరుమూర్తి స్పందిస్తూ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘రాయబారి గారూ, దయచేసి ఆధిపత్య ధోరణితో స్నేహాన్ని ప్రదర్శించవద్దు. ఏం చేయాలో మాకు తెలుసు’’ అని సున్నితంగా హెచ్చరించారు.
 ఉక్రెయిన్‌ వ్యవహారంపై ఎలా స్పందించాలో తమకు తెలుసునని, తమకు ఎవరూ సలహాల ఇవ్వాల్సిన అవసరం లేదని తిరుమూర్తి డచ్‌ రాయబారికి సమాధానమిచ్చారు. ఐరాస విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము పాటిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవమిస్తామని స్పష్టం చేశారు.
 ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన నాటి నుంచి హింసను ఆపాలని.. చర్చలు, దౌత్య సంబంధాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్‌ రెండు దేశాలకు సూచిస్తూనే ఉందని ఆయన గుర్తు చేశారు.  ఈ యుద్ధం కారణంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, బుచాలో పౌరుల హత్యను భారత్‌ తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. 
 
బుచా పౌరులపై జరిగిన హత్యపై అంతర్జాతీయ దర్యాప్తు చేయాలని కోరామని తెలిపారు. ఉక్రెయిన్‌కు అవసరమైన మానవతా సాయం కూడా అందించామని, యుద్ధంలో ఎవరివైపు విజయం ఉండదని తాము భావిస్తున్నామని చెప్పారు.