కరోనా మరణాల డబ్ల్యుహెచ్‌ఒ సంఖ్యపై మండిపడ్డ భారత్

అధికారిక గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి 5.24 లక్షల మంది కరోనాతో మరణించారని భారత్‌ పేరొక్నతుండగా, అందుకు తొమ్మిది రేట్లకు పైగా భారత్ లో  మరణాలు జరిగాయని అంటూ అంచనాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) నివేదిక విడుదల కావడం పట్ల భారత్ లో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా ప్రభావంతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లలో సుమారు 1.50 కోట్ల మంది మరణించినట్లు అంచనా వేసిన డబ్ల్యుహెచ్‌ఒ, భారత్‌లోనే 47.40 లక్షల మంది మరణించారని గురువారం తాజా నివేదికలో పేర్కొంది. 2020 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 వరకు కరోనా ప్రభావంతో నమోదైన మృతులపై డబ్ల్యుహెచ్‌ఒ ఈ అంచనాలను రూపొందించింది.
అయితే, ఈ నివేదికలో వాస్తవం లేదని, అర్థరహితమని  కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌.కె. అరోరా స్పష్టం చేశారు. డబ్ల్యుహెచ్‌ఒ తీరు దుర్మార్గంగా ఉందని మండిపడుతూ,  అంచనాలు  ఆమోద యోగ్యం కాదని  తేల్చి చెప్పారు.  డబ్ల్యుహెచ్‌ఒ అనుసరిస్తున్న లెక్కింపు విధానాలపై తాము ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని. అయినా పట్టించుకోకుండా ఈ అంచనాలను విడుదల చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడుతూ సైన్స్ అబద్ధం చెప్పదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ఆత్మీయులను కోల్పోయినవారికి ప్రభుత్వం సహాయం అందించాలని, ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
కరోనా కారణంగా సంభవించిన మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్తున్నదంతా అవాస్తవమని బీజేపీ పేర్కొంది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ బేటా (కుమారుడు), డబ్ల్యూహెచ్ఓ డేటా తప్పుడువని ధ్వజమెత్తారు. 
కరోనా మహమ్మారి కారణంగా భారత దేశంలో సంభవించిన మరణాల సంఖ్యను అంచనా వేసేందుకు డబ్ల్యూహెచ్ఓ అనుసరించిన పద్ధతి లోపభూయిష్టమైనదని, ఊహాజనితమైనదని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓకు భారత ప్రభుత్వం తెలియజేసిందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీర్తి, ప్రతిష్ఠలను తగ్గించాలని రాహుల్ గాంధీ 2014 నుంచి ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రక్రియలో ఆయన భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను తగ్గిస్తున్నారని బిజెపి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో జనన, మరణాలను నమోదు చేసే యంత్రాంగం చాలా పటిష్టంగా ఉందని చెబుతూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన చెప్పారు.
మోదీ నాయకత్వంలో ఈ మహమ్మారిపై పోరాడిన తీరు ఇతర దేశాలకు మార్గదర్శకమని ప్రపంచం విశ్వసిస్తోందని పేర్కొంటూ,  మరణాల సంఖ్యపై రాజకీయాలు చేయడం అత్యంత విచారకరమని చెప్పారు. అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సమర్థవంతంగా భారత దేశం ఈ మహమ్మారిపై పోరాడిందని స్పష్టం చేశారు.