అమర్‌నాథ్ యాత్ర అడ్డుకొనే ఉగ్ర కుట్ర భగ్నం

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం శుక్రవారం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్ అష్రాఫ్ మౌల్వి, అతని సహచరులు ఇద్దరు హతమయ్యారు.
 
పహల్గావ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బట్‌కూట్ అడవుల్లో సుమారు నాలుగు గంటల సేపు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.  అష్రాఫ్ మౌల్వితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను యాత్రా మార్గంలో మట్టుపెట్టడం ద్వారా తాము జరిపిన మేజర్ ఆపరేషన్ విజయవంతమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు.
 
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, టెంగ్‌పావ కోకెర్‌నాగ్‌కు చెందిన అష్రాఫ్ మౌలి 2013లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరారు. అచిరకాలంలోనే కశ్మీర్‌లో లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారాడు.
సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న 200 మంది ఉగ్రవాదులు!
అదను చూసుకొని, దేశంలో ప్రవేశించడం కోసం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నట్లు భద్రతా దళాలు పసిగట్టాయి. దాదాపు 200 మంది వరకూ టెర్రరిస్టులు జమ్మూ కశ్మీర్‌లోకి చొచ్చుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
 
 వీరి కదలికలపై అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ పాక్ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటివరకైతే సాఫీగానే సాగుతోందని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 
 
స్థానికంగా వీరికి మద్దతు సాయం లేకపోవడంతో, ఇప్పటికే 21 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు పెట్టడంతో క్రమేపీ ఉగ్రవాదుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు.  అయితే పాకిస్థాన్ వైపు నుంచి 200 మంది వరకూ ఉగ్రవాదులు సరిహద్దులు దాటివచ్చేందుకు యత్నిస్తున్నారనే అంశంపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు.